క్రిప్టోపై నియంత్రణ అవసరం.. పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశంలో అభిప్రాయం

క్రిప్టో కరెన్సీ వినియోగం ద్వారా కలిగే లాభనష్టాలపై చర్చించేందుకు పార్లమెంటరీ ప్యానెల్‌ సోమవారం సమావేశమైంది.

Updated : 13 May 2022 17:17 IST

దిల్లీ: క్రిప్టో కరెన్సీ వినియోగం ద్వారా కలిగే లాభనష్టాలపై చర్చించేందుకు పార్లమెంటరీ ప్యానెల్‌ సోమవారం సమావేశమైంది. భాజపా నేత జయంత్‌ సిన్హా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. క్రిప్టో కరెన్సీపై నియంత్రణ అవసరమని సమావేశంలో మెజారిటీ సభ్యులు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం, నియంత్రణ గానీ లేవు. అలాగే, ఈ అంశంపై పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మాజీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయిన జయంత్‌ సిన్హా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో క్రిప్టో ఎక్స్ఛేంజీలు, బ్లాక్‌ చెయిన్‌ అండ్ క్రిప్టో అస్సెట్‌ కౌన్సిల్‌ (బీఏసీసీ), పరిశ్రమ వర్గాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించే కంటే దానిపై నియంత్రణ విధించాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్త పరిచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్న కొందరు కాంగ్రెస్‌ పార్టీ నేతలు పీటీఐతో పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల వినియోగంతో మనీలాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధులు వెళ్లే అవకాశం ఉందని కూడా పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని