అవును ఆ లేఖ నేనే రాశాను: పరమ్‌బీర్‌

ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో మహారాష్ట్ర సర్కారుకు కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటి సీఎం ఉద్ధవ్‌ ఠాక్రెకు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ రాసినట్లు

Published : 21 Mar 2021 16:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో మహారాష్ట్ర సర్కారుకు కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటి సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ రాసినట్లు చెబుతున్న లేఖపై పలు అనుమానాలు ఏర్పడ్డాయి. నేడు ఆ ఊహాగానాలకు ఐపీఎస్‌ అధికారి పరమ్‌బీర్‌ సింగ్‌ తెరదించారు. తానే ఆ లేఖను సీఎంకు రాసినట్లు అంగీకరించారు. 

ఆ లేఖపై పరమ్‌బీర్‌ సంతకం లేకపోవడంతో తొలుత చాలా మంది అనుమానించారు. కానీ, ఆ తర్వాత పరమ్‌బీర్‌ సింగ్‌ తానే ముఖ్యమంత్రికి ఆ లేఖను రాసినట్లు వెల్లడించారు. త్వరలోనే తన సంతకంతో ఉన్న కాపీని సీఎం కార్యాలయానికి కూడా పంపనున్నట్లు వెల్లడించారు. ఆ లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. 

ఇరకాటంలో మహా సర్కారు..

పరమ్‌బీర్‌ రాసిన లేఖలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నెలకు రూ.100 కోట్లను వసూలు చేయాల్సిందిగా వాజేకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ లక్ష్యంగా నిర్ణయించారని పేర్కొన్నారు. వీటిల్లో దాదాపు 60 కోట్ల వరకు ముంబయిలోని పబ్‌లు, రెస్టారెంట్ల నుంచి వసూలు చేసి..ఇతర మార్గాల్లో మిగిలిన మొత్తం వసూలు చేయాలని సూచించినట్లు పరమ్‌బీర్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని తాను సీఎం ఠాక్రే, డిప్యూటీసీఎం అజిత్‌ పవార్‌, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌లకు వివరించినట్లు పేర్కొన్నారు. దీనిపై అనిల్‌ దేశ్‌ముఖ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్‌ తప్పించుకొనేందుకు ఆరోపణలు చేస్తున్నారని.. పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యల్లో భాగంగా ఆ లేఖ పరమ్‌బీర్‌ సింగ్‌ సంతకంతో కానీ, అధికారిక ఈ మెయిల్‌ నుంచి కానీ రాలేదని పేర్కొనింది. దీనిపై దర్యాప్తు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. దీనిపై నేడు పరమ్‌బీర్‌ సింగ్ ఓ ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ తాను సీఎంకు లేఖ రాసినట్లు వెల్లడించారు. తన సంతకంతో ఉన్న లేఖను సీఎంవోకు పంపిస్తానని వెల్లడించారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని