Pakistan: దైవదూషణ ఆరోపణలు.. పాక్‌లో శ్రీలంక జాతీయుడి బహిరంగ దహనం!

పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలపై ఆగ్రహంతో ఊగిపోయిన ఓ మూక.. ఓ శ్రీలంక జాతీయుడిని చిత్రహింసలకు గురి చేసి చంపి, ఆపై అతని మృతదేహాన్ని బహిరంగంగా దహనం చేసింది. పంజాబ్‌ ప్రావిన్స్‌ సియాల్‌కోట్‌లోని వజీరాబాద్...

Published : 03 Dec 2021 22:02 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలపై ఆగ్రహంతో ఊగిపోయిన ఓ మూక.. శ్రీలంక జాతీయుడిని చిత్రహింసలకు గురి చేసి చంపి, ఆపై అతని మృతదేహాన్ని బహిరంగంగా దహనం చేసింది. పంజాబ్‌ ప్రావిన్స్‌ సియాల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక్కడి ప్రైవేట్ కార్మాగారాల్లో పనిచేసే కార్మికులు.. అక్కడే ఓ పరిశ్రమలో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీలంక జాతీయుడిపై దాడి చేసి, అతన్ని చంపిన తర్వాత, మృతదేహాన్ని తగులబెట్టినట్లు పేర్కొంది. మృతుడిని ప్రియాంత కుమారగా గుర్తించినట్లు సియాల్‌కోట్ జిల్లా పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అయితే, దైవదూషణకు పాల్పడినందుకుగానూ అతన్ని శిక్షించాలంటూ అక్కడున్న వందలాదిమంది నినాదాలు చేస్తున్న వీడియోలు స్థానికంగా వైరల్‌గా మారాయి. దాడికి పాల్పడిన వారిలో చాలామంది తెహ్రీక్‌-ఇ-లబ్బాయిక్‌ పాకిస్థాన్‌ (టీఎల్‌పీ) పార్టీ మద్దతుదారులని స్థానిక అధికారులు తెలిపారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆందోళన..

పంజాబ్ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ ఈ ఘటనను విషాదకరమైనదిగా అభివర్ణించారు. వెంటనే దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు ఘటనాస్థలంలోనే ఉన్నారని.. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పంజాబ్ ఐజీపీ అలీఖాన్ వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ దక్షిణాసియా విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు తక్షణమే నిష్పక్షపాతంగా, సత్వర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని డిమాండ్‌ చేసింది. 2010లోనూ ఈ ప్రాంతంలో ఇదే తరహా జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఇదిలా ఉండగా టీఎల్‌పీ పార్టీపై పాక్‌ ప్రభుత్వం ఇటీవలే నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని