Pakistan: పాక్‌.. మళ్లీ అదే పాత పాట.. ఎఫ్‌-16 విమానం కూలలేదట!

పాకిస్థాన్‌ భూభాగంలోని బాలాకోట్‌పై భారత వాయుసేన దాడి అనంతరం ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌ - 16 విమానం కూల్చివేతపై దాయాది

Updated : 24 Nov 2021 16:35 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ భూభాగంలోని బాలాకోట్‌పై భారత వాయుసేన దాడి అనంతరం ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌ - 16 విమానం కూల్చివేతపై దాయాది దేశం మళ్లీ పాత పాటే పాడుతోంది. భారత్‌ కూల్చింది ఎఫ్‌-16 కాదంటూ మొదట్నుంచీ వాదిస్తున్న పాక్‌.. తాజాగా మరోసారి అబద్ధాలు వల్లెవేసింది. ఆ విమానాన్ని కూల్చిన వింగ్‌ కమాండర్‌(ఇప్పుడు గ్రూప్‌ కెప్టెన్‌) అభినందన్‌ వర్ధమాన్‌కు నిన్న వీర్‌చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసిన నేపథ్యంలో పాక్‌ దీనిపై మరోసారి స్పందించింది. 

‘‘2019 ఫిబ్రవరిలో భారత పైలట్‌.. పాకిస్థానీ ఎఫ్‌-16 కూల్చివేశాడంటూ ఆ దేశం చేసిన నిరాధార ప్రకటనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నాం. ఆ రోజు పాక్‌కు చెందిన ఎఫ్‌-16 విమానం కూలలేదని ఇప్పటికే అమెరికా అధికారులు సహా అంతర్జాతీయ నిపుణులు ధ్రువీకరించారు’’ అని పాక్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక, భారత్‌ దూకుడుగా ఉన్నప్పటికీ ఆ దేశంతో తాము శాంతినే కోరుకుంటున్నామని, అభినందన్‌ వర్ధమాన్‌ విడుదలే అందుకు నిదర్శనమంటూ ‘నీతి వచనాలు’ పలకడం గమనార్హం. 

2019 ఫిబ్రవరి 26 తెల్లవారజామున పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో గల ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన మెరుపుదాడికి పాల్పడి బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలాకోట్‌పై దాడిని ఖండిస్తూ ఆ మరుసటి రోజు పాక్ వైమానిక దళం.. భారత్‌పై దాడికి యత్నించింది. అయితే దీన్ని భారత వాయుసేన కూడా తిప్పికొట్టింది. పాక్‌కు చెందిన ఎఫ్‌-16 విమానం మన వైపు దూసుకురాగా.. వింగ్‌ కమాండర్‌గా ఉన్న అభినందన్‌ మిగ్‌-21 విమానంతో వెంటాడి దాన్ని నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్‌ సాయంతో కిందకు దూకగా అది పాక్‌ భూభాగంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని పాక్‌ జవాన్లు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. కాగా.. అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్‌ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాక్‌ సైన్యం మూడు రోజుల తర్వాత ఆయనను వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది. ఆయన ధైర్యాన్ని గుర్తించి భారత ప్రభుత్వం వీర్‌ చక్ర పురస్కారంతో సత్కరించింది. 

అయితే ఈ దాడిలో పాక్‌ ఎఫ్‌-16 విమానం కూలిపోయిందన్న వార్తలు బయటకు రాగానే అమెరికా ఆ దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మాట మార్చిన పాక్‌.. భారత్‌ కూల్చింది ఎఫ్‌-16 విమానం కాదని వెల్లడించింది. తమ వద్ద ఉన్న ఎఫ్‌-16 విమానాల లెక్క సరిపోయిందని తెలిపింది. అయితే భారత్‌ ఆర్మీ మాత్రం అది ఎఫ్‌-16 విమానమే అని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని గట్టిగా చెప్పింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని