Pakistan: అఫ్గాన్‌ వ్యవహారంలో కీలక పరిణామం.. తాలిబన్‌ దౌత్యవేత్తలకు పాక్‌ అనుమతి

అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి మొదటి నుంచి మద్దతు పలుకుతున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకున్నా.. మరోవైపు పాక్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం, ఆయా కాన్సులేట్‌లలో...

Published : 30 Oct 2021 19:04 IST

ఇస్లామాబాద్‌: అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి మొదటి నుంచి మద్దతు పలుకుతున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకున్నా.. మరోవైపు పాక్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం, ఆయా కాన్సులేట్‌లలో విధులు చేపట్టేందుకు తాలిబన్లు నియమించిన దౌత్యవేత్తలను అనుమతించినట్లు సమాచారం. ఈ మేరకు వారికి వీసాలూ జారీ చేసింది. సర్దార్ మహమ్మద్ షోకైబ్ ఇస్లామాబాద్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయంలో ఫస్ట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. హఫీజ్ మొహిబుల్లా, ముల్లా గులాం రసూల్, ముల్లా ముహమ్మద్ అబ్బాస్‌ ఇక్కడి పెషావర్, క్వెట్టా, కరాచీ కాన్సులేట్‌లకు అధికారులుగా నియమితులైనట్లు ఓ వార్తాపత్రిక వెల్లడించింది.

శరణార్థుల సమస్యలు తీర్చేందుకేనంటూ..

ఇక్కడ అఫ్గాన్‌ చివరి రాయబారిగా అష్రఫ్‌ ఘనీ పాలనలో నజీబుల్లా అలిఖిల్ వ్యవహరించారు. అయితే.. ఆయన కుమార్తె అపహరణ పరిణామాల నడుమ ఈ ఏడాది జులైలో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పటినుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఫస్ట్‌ సెక్రటరీగా నియమితులైన షోకైబ్.. పష్తూన్‌ తెగకు చెందినవాడని, ఒకప్పుడు ఖారీ యూసఫ్ అహ్మదీ పేరుతో తాలిబన్ల ప్రతినిధిగా పనిచేసినట్లు సమాచారం. గతంలో పాకిస్థాన్‌లో ఒకసారి అరెస్టు కూడా అయ్యాడు. అనంతరం కొన్నేళ్లు అక్కడే పెషావర్‌లో నివసించాడు. మరోవైపు పాక్‌ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ ఈ నియామకాలపై మాట్లాడుతూ.. దీన్ని పరిపాలన సంబంధిత అంశంగా పేర్కొన్నారు. ‘పాక్‌లో లక్షల మంది అఫ్గాన్‌ శరణార్థులు ఉన్నారు. వీసా సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారానికే ఈ చర్యలు చేపట్టారు’ అని చెప్పారు. అఫ్గాన్‌లో కొత్తగా ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలంటూ పాకిస్థాన్.. అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించేందుకు యత్నిస్తోన్న విషయం తెలిసిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని