నో మాస్క్‌: 15లక్షల మందికి జరిమానా!

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని 15లక్షల మందిపై చర్యలు తీసుకున్న అధికారులు, దాదాపు రూ.30కోట్లను వసూలు చేసినట్లు వెల్లడించారు.

Published : 17 Feb 2021 16:04 IST

ముంబయి అధికారుల చర్యలు

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో అన్ని రాష్ట్రాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో మాత్రం వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరిస్తూ, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ముంబయి అధికారులు సూచిస్తున్నారు. అయితే, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని 15లక్షల మందిపై చర్యలు తీసుకున్న అధికారులు, వారినుంచి దాదాపు రూ.30కోట్లను వసూలు చేసినట్లు వెల్లడించారు.

కరోనా ధాటికి వణికిపోయిన ముంబయిలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఇందులోభాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. కేవలం సోమవారం ఒక్కరోజే 13వేల మందికి జరిమానా విధించగా, వీరి నుంచి రూ. 26లక్షలు వసూలు చేశారు. ఇలా గతేడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15, 2021 మధ్య కాలంలో మాస్కు ధరించని 15లక్షల (15,16,398) మందికి జరిమానా విధించి, వీరి నుంచి రూ.30కోట్ల (30,69,09,800)ను వసూలు చేశామని వెల్లడించారు. ముంబయిలోని ప్రముఖ ప్రాంతాలైన జుహూ, అంధేరీ, వెర్సోవా వంటి ప్రాంతాల్లోనే కొవిడ్‌ నిబంధనలు పాటించని దాదాపు లక్ష మందికి జరిమానా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరోసారి లాక్‌డౌన్‌ తప్పదు..!

ఇదిలాఉంటే, ముంబయిలో కరోనా తీవ్రత అదుపులోకి వస్తున్నట్లు భావిస్తున్న సమయంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ముంబయి అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నగరంలో లోకల్‌ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం దాదాపు 34లక్షల మంది ప్రయాణించే ఈ లోకల్‌ సబర్బన్‌ రైళ్లలో కొవిడ్‌ వ్యాప్తికి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రైళ్లలోనూ మాస్కులు ధరించని వారిపై రైల్వే పోలీసుల సహకారంతో బీఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారు. అయితే, నగరంలో కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే, ముంబయిలో మరోసారి లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని నగర మేయర్‌ హెచ్చరించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక, రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, వైరస్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని