Omicron: అప్రమత్తతతోనే.. ‘ఒమిక్రాన్‌’కు అడ్డుకట్ట

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (బీ.1.1.529)పై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Updated : 29 Nov 2021 05:06 IST

అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా

విస్తృతంగా పరీక్షలు.. వ్యాక్సినేషన్‌

వైద్య ఆరోగ్య వసతుల పెంపు

రాష్ట్రాలకు కేంద్రం పథ నిర్దేశం

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (బీ.1.1.529)పై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులపై గట్టి నిఘా ఉంచి అందరికీ పరీక్షలు చేయించాలని, పాజిటివ్‌గా తేలిన నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణకు పంపించాలని సూచించింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కరోనా పరీక్షలు పెంచాలని, వైరస్‌ సోకిన వారికి తక్షణం వైద్య సేవలు అందించేందుకు వీలుగా మౌలిక వసతులు పెంచుకోవాలని నిర్దేశిస్తూ సూచనలు చేశారు. వివరాలివి..

* అంతర్జాతీయ ప్రయాణికులను నిరంతరం పర్యవేక్షించడానికి సమాయత్తం కావాలి. ప్రధానంగా ముప్పు అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు చేయించి, పాజిటివ్‌గా తేలిన అన్ని నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ ఆధ్వర్యంలోని ల్యాబ్‌లకు తప్పనిసరిగా పంపాలి.
* గతంలో అంతర్జాతీయ మార్గాల నుంచి వచ్చిన ప్రయాణికులు వివరాలను సేకరించి అందించే యంత్రాంగం ఇప్పటికే అందుబాటులో ఉంది. ఆ వివరాలను విశ్లేషించాలి.
* కేసులు పెరిగితే ఎదుర్కోవడానికి, పరీక్షల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను పెంచుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల నిష్పత్తి తగ్గినట్లు కనిపిస్తోంది. అందువల్ల రాష్ట్రాలు పరీక్షలు పెంచడంతో పాటు, కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఆ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి.
* హాట్‌స్పాట్‌లను నిరంతరం పర్యవేక్షించాలి. ఇలాంటి చోట్ల గరిష్ఠస్థాయిలో పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ నమూనాలను తక్షణం జన్యుక్రమ పరిశీలనకు పంపాలి. కేసుల్లో వస్తున్న మార్పులపై సూక్ష్మంగా దృష్టి సారించాలి. పాజిటివిటీ రేటు 5% లోపునకు పరిమితం చేసే లక్ష్యంతో పనిచేయాలి. రోగులను ఆదిలోనే గుర్తించి, వారిని ఏకాంతంగా ఉంచి వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలి.
* వైరస్‌ సోకిన వారికి తక్షణం వైద్యసేవలు అందించాలి. నాణ్యమైన వైద్యం అందించడంలో ఏమాత్రం రాజీ పడకూడదు. కేంద్ర ఆర్థిక సాయాన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి.
* సాధారణ ప్రజలు, సమూహాల్లో పెద్దఎత్తున పరీక్షలు నిర్వహించి ఆ నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణకు పంపాలి.
* కొవిడ్‌పై అసత్య ప్రచారాలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తాయి. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు విలేకర్ల సమావేశాల ద్వారా సరైన సమాచారాన్ని నిరంతరం అందిస్తుండాలి. సరైన ఆధారాలతో కూడిన బులిటెన్లు విడుదల చేయాలి.


ఆ దేశాల నుంచి విమానాలు నిలిపివేయండి

ప్రధానికి కేజ్రీవాల్‌ లేఖ

దిల్లీ: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు బయటపడిన దేశాల నుంచి తక్షణం విమానాల రాకపోకలు నిలిపివేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎలాంటి జాప్యం తగదని.. ఒమిక్రాన్‌ బారిన పడిన ఎవరైనా దేశంలోకి ప్రవేశిస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే విమానాల రాకపోకలను పలు దేశాలు నిలిపివేసిన విషయాన్ని ప్రస్తావించారు.


కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరి : గులేరియా

దిల్లీ: కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ ప్రయాణికులపైన, ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లోనూ పక్కా నిఘా అవసరమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌ జాగ్రత్తలు పాటించేలా చూడాలని, ఎలాంటి ఉదాసీనత వద్దని స్పష్టం చేశారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా రెండు డోసులూ తప్పక తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని