Omicron: ఒమిక్రాన్‌ పుట్టుకకు జలుబూ సహకరించిందా?

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనిపై సమగ్ర సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు....

Updated : 04 Dec 2021 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనిపై సమగ్ర సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తే కట్టడి సులభమయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో మసాచూసెట్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ డేటా అనలిటిక్స్‌ ఎన్ఫరెన్స్‌ సంస్థ కీలక విషయాన్ని తెరపైకి తెచ్చింది. ఒమిక్రాన్‌లో వచ్చిన పరివర్తనాల్లో కనీసం ఒకటి సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్‌ వల్ల అయి ఉంటుందని పేర్కొంది. ఈ అధ్యయనానికి వెంకట సౌందరాజన్‌ అనే శాస్త్రవేత్త నేతృత్వం వహించారు. దీన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

కరోనా, జలుబు రెండూ సోకిన వ్యక్తిలో ఈ పరివర్తనం జరిగి ఉంటుందని అధ్యయనం తెలిపింది. రెండు వైరస్‌లతో ఇన్‌ఫెక్ట్‌ అయిన కణంలో ఈ ప్రక్రియ చోటు చేసుకొని ఉంటుందని పేర్కొంది. ఊపిరితిత్తులు, జీర్ణశయాంతర వ్యవస్థల్లో కరోనా వైరస్‌, జలుబు వైరస్‌ రెండూ ఒకేసారి కలిసి ఉండే అవకాశం ఉందని గతంలో కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఆ సమయంలోనే వైరల్‌ రీకాంబినేషన్‌ జరిగి ఉంటుందని తాజా పరిశోధన తెలిపింది. ఈ ప్రక్రియలో సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్‌లోని కొంత జన్యు పదార్థాన్ని కరోనా వైరస్‌ తీసుకొని ఉంటుందని తెలిపింది. ఒమిక్రాన్‌లో వచ్చిన అనేక పరివర్తనాల్లో ఒకదానికి ఇది కారణమై ఉంటుందని వెల్లడించింది. ఈ పరివర్తనంలో ఉన్న జన్యుక్రమం గతంలో వచ్చిన ఏ వేరియంట్‌లోనూ కనిపించలేదని తెలిపింది. కానీ, జలుబుకు కారణమయ్యే వైరస్‌ సహా మానవ జన్యుక్రమంలోనూ ఇది ఉన్నట్లు తెలిపారు.

ఈ పరివర్తనం వల్లే ఎక్కువగా వ్యాప్తి చెందే గుణాన్ని ఒమిక్రాన్‌ పొంది ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే లక్షణాలు, వ్యాధి తీవ్రత మాత్రం స్వల్పంగానే ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ వల్ల తలెత్తుతున్న లక్షణాలు, వాటి తీవ్రతను నిర్ధారించే సమాచారమేదీ అందుబాటులో లేదు.

‘‘ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ రేటు కూడా ఎక్కువే. హెచ్‌ఐవీ వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి జలుబు సహా ఇతర ఇన్ఫెక్షన్లు సోకి ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతంలోనే రీకాంబినేషన్లు చోటుచేసుకొని ఒమిక్రాన్‌ జనించి ఉంటుంది. కొత్త వేరియంట్ల పుట్టుక వ్యాక్సిన్ల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి’’ అని సౌందరరాజన్‌ తెలిపారు.

ఒమిక్రాన్‌ను అర్థం చేసుకోవడానికి మరింత నిర్దిష్టమైన, లోతైన అధ్యయనాలు జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్‌ ఎలుకల్లో పరివర్తనం చెంది ఉంటుందన్న వాదన కూడా ప్రాచుర్యంలో ఉండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని