‘నోవావాక్స్‌’ టీకా: 96.4శాతం సమర్థతతో..!

అమెరికాకు చెందిన నోవావాక్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 96.4శాతం సమర్థత చూపించినట్లు ప్రయోగ ఫలితాల్లో తేలింది.

Published : 13 Mar 2021 01:16 IST

ప్రయోగ ఫలితాలను వెల్లడించిన అమెరికన్‌ సంస్థ

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో వ్యాక్సిన్‌ కూడా కొవిడ్‌ మహమ్మారిపై సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అమెరికాకు చెందిన నోవావాక్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 96.4శాతం సమర్థత చూపించినట్లు ప్రయోగ ఫలితాల్లో తేలింది. అంతేకాకుండా కేవలం ఒక్క డోసు తీసుకున్న కొన్ని వారాల్లోనే 83.4శాతం ప్రభావశీలత చూపించినట్లు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ‘నోవావాక్స్’ సంస్థ‌ ప్రకటించింది.

నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాల్లో భాగంగా, బ్రిటన్‌లో 15వేల మందిపై, దక్షిణాఫ్రికాలో నాలుగున్నర వేల మంది వాలంటీర్లపై నోవావాక్స్‌ ప్రయోగాలు జరిపింది. దక్షిణాఫ్రికాలో దాదాపు 245 మంది ఎయిడ్స్‌ రోగులపైనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను చేపట్టింది. ప్రయోగాల్లో పాల్గొన్న మొత్తం వాలంటీర్లలో 106మంది కొవిడ్‌ బారినపడగా, వీరిలో పది మంది మాత్రమే వ్యాక్సిన్‌ గ్రూపునకు చెందినవారు. మిగిలిన వారంతా ప్రయోగాల్లో ప్లెసిబో టీకాను పొందిన వారేనని నోవావాక్స్‌ తెలిపింది. ఇలా ఒరిజినల్‌ స్ట్రెయిన్‌పై 96.4శాతం సమర్థత చూపించగా, ఈ మధ్యే వెలుగుచూసిన కొత్త రకం యూకే వైరస్‌లపై 86.3శాతం సమర్థత చూపించిందని నోవావాక్స్‌ పేర్కొంది. బ్రిటన్‌లో జరిపిన ప్రయోగాల్లో మొత్తం 89.7శాతం ప్రభావశీలత చూపించిందని, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన వైరస్‌పై మాత్రం 55.4శాతం ప్రభావం చూపించినట్లు తేలింది. అయినా కొత్తరకం వైరస్‌లపై ఇది సమర్థవంతంగానే పనిచేస్తుందని నోవావాక్స్‌ ప్రకటించింది. తాజా ఫలితాలతో వివిధ దేశాల్లో అనుమతికి నోవావాక్స్‌ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

నోవావాక్స్ టీకా ప్రభావశీలత ఫలితాలు భారత్‌కు కలిసివచ్చే విషయంగా నిపుణులు భావిస్తున్నారు. అమెరికాకు చెందిన నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులోభాగంగా కొవావాక్స్‌ పేరుతో దాదాపు వందకోట్ల డోసులను సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసే అవకాశం ఉంది. ఇదిలాఉంటే, ఇప్పటికే అమెరికాలో మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా, భారత్‌లో రెండు వ్యాక్సిన్‌ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని