Dr Fauci: ఫౌచీ స్వరం మారింది..!

సార్స్‌కోవ్‌-2 వైరస్‌ సహజంగా అభివృద్ధి చెందింది అంటే ఒక పట్టాన నమ్మకం కలగలేదని.. దానిపై దర్యాప్తు నిర్వహించాలని

Published : 24 May 2021 16:37 IST

  దర్యాప్తు కొనసాగింపునకు మద్దతు

వాషింగ్టన్‌: సార్స్‌కోవ్‌-2 వైరస్‌ సహజంగా వృద్ధి చెందిందంటే ఒక పట్టాన నమ్మకం కలగడంలేదని.. దానిపై దర్యాప్తు నిర్వహించాలని అమెరికాకు చెందిన అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. ఆయన ‘యునైటెడ్‌ ఫాక్ట్‌ ఆఫ్‌ అమెరికా: ఎ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌చెకింగ్‌’ అనే కార్యక్రమంలో పాల్గొని  మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా.. ‘మీరు ఇంకా కరోనావైరస్‌ సహజంగా వచ్చిందనే నమ్ముతున్నారా? ’ అని ప్రశ్నించగా ఆయన స్పందించారు.  ‘‘నాకు దానిపై నమ్మకం కలగటంలేదు. మనం చైనాలో ఏం జరిగిందనేదానిపై శక్తికొద్దీ దర్యాప్తు నిర్వహించి ఒక నిర్ణయానికి రావాలి. ముఖ్యంగా ఇప్పటికే దీని గురించి తనిఖీ చేసినవారు మాత్రం ఇది జంతువుల నుంచే మనుషులకు సోకినట్లు చెబుతున్నారు. కానీ, ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది.. దానిని వెలికి తీయాలి. అందుకే వైరస్‌ పుట్టుక తెలుసుకొనేందుకు ఎప్పుడూ పారదర్శకమైన దర్యాప్తునకు నేను మద్దతు ఇస్తాను’’ అని పేర్కొన్నారు. 

ల్యాబ్‌ నుంచి లీక్‌ కాలేదని వస్తున్న వాదనలపై ప్రశ్నించగా ఫౌచీ ఆచితూచి స్పందించారు. తాను చైనాలో ఏం జరిగిందనే అంశంపై దర్యాప్తును కొనసాగించడానికి మద్దతు ఇస్తానని తెలిపారు. ల్యాబ్‌ నుంచి లీక్ అయిందనే వాదనను ఆయన కొట్టిపారేయలేదు. కాకపోతే వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌’ ప్రయోగాలకు (వైరస్‌లలో మార్పులు చేసే ప్రక్రియ)  ఎన్‌ఐహెచ్‌, ఎన్‌ఐఏఐడీ సంస్థల నుంచి నిధులు మాత్రం  వెళ్లలేదని ఆయన పునరుద్ఘాటించారు. 

గతేడాది ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచి లీక్ అయిందని డాక్టర్‌ ఫౌచీ అన్నాడు. జన్యుమార్పిడితో తయారు చేశారనే వాదనలను చాలాసార్లు కొట్టిపారేశారు. మరోపక్క శ్వేత సౌధం కూడా ల్యాబ్‌లీక్‌ సిద్ధాంతానికి ఆధారాలు లేవని కొట్టిపారేయటం లేదు. కాకపోతే స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని కోరుతోంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని