North Korea: జపాన్‌ సముద్రంలోకి ఉ.కొరియా క్షిపణి..!

జలాంతర్గామి నుంచి ప్రయోగిస్తున్నట్లుగా అనుమానిస్తున్న ఓ క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది.

Published : 19 Oct 2021 19:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జలాంతర్గామి నుంచి ప్రయోగించినట్లు అనుమానిస్తున్న ఓ క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. మంగళవారం దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌  మాట్లాడుతూ ఉత్తరకొరియాలోని ‘పోర్ట్‌ ఆఫ్‌ సిన్పో’ నుంచి దీనిని ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఈ పోర్టులో తరచూ సబ్‌మెరైన్లను నిలుపుతుంటారు. ఇక్కడి నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్‌ సముద్రంలో పడింది. ఈ నేపథ్యంలో దీనిని సబ్‌మెరైన్‌ నుంచి ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో 450 కిలోమీటర్లు ప్రయాణించింది.  ఈసందర్భంగా జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద మాట్లాడుతూ ఈ పరీక్షలపై విచారం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, జపాన్‌లు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. వాస్తవానికి ఈ క్షిపణి 1900 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

మరోపక్క దక్షిణ కొరియా కూడా సొంతంగా ఆయుధాలను అభివృద్ధి చేయడం, పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉ.కొరియా గుర్రుగా ఉంది. ద.కొరియా ఈ వారం అతిపెద్ద ఆయుధ ఎగ్జిబిషన్‌ను  ప్రారంభించనుంది. ఇటీవలే ద.కొరియా, జపాన్‌, అమెరికా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లు సియోల్‌లో భేటీ అయి  కీలక విషయాలపై చర్చించారు.

సెప్టెంబరులో ఉత్తర, దక్షిణ కొరియాలు రోజుల వ్యవధిలో పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి.  మూడు సరికొత్త క్షిపణులను ఉత్తర కొరియా బాహ్యప్రపంచానికి చూపింది. 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్రూజ్‌ క్షిపణిని తొలిసారి పరీక్షించింది. ఇది జపాన్‌లోని ఒకినావాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఆయుధం. రైలుపై నుంచి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఐరాస సర్వసభ్య సమావేశం ముగిసిన తరవాత అణ్వాయుధ ప్రయోగ సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని