Heavy rain:  కేరళలో భారీ వర్షాలకు 11 మంది మృతి!

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతిచెందారు....

Updated : 17 Oct 2021 12:45 IST

ఉత్తరాదికీ భారీ వర్ష సూచన

తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది మృతిచెందారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అయితే, భారీ వర్షాల ధాటికి ఉప్పొంగిన వాగులు, వంకల కారణంగా వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో శబరిమల దర్శనానికి ఎవరూ రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఉదయానికి చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈరోజు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. కేరళలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. కేంద్రం తరఫున కావాల్సిన సహాయ సహకారాలను అందజేస్తామని హామీ ఇచ్చారు.

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్రివిధ దళాల సిబ్బంది, జాతీయ విపత్తుల స్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సీఎం పినరయి విజయన్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేకంగా కొవిడ్‌ నిబంధనలతో కూడిన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కావాల్సినన్ని మాస్కులు, శానిటైజర్లు, మంచినీరు, ఔషధాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

కేరళ వద్ద ఆగ్నేయ అరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  ఈ క్రమంలో పథనంతిట్ట, కొట్టాయం సహా మొత్తం ఆరు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఇక్కడ అతిభారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

* మరోవైపు ఉత్తరాదిలో దేశ రాజధాని దిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌లో పలు ప్రాంతాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని