Covid AY.4.2: ‘ఏవై.4.2 వేరియంట్‌ వ్యాప్తి వేగవంతమే.. కానీ, ప్రాణాంతకం కాదు!’

కొవిడ్‌ వైరస్‌ మరో ఉత్పరివర్తనం చెంది ప్రస్తుతం ‘ఏవై.4.2’ వేరియంట్‌ రూపంలో వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు ఈ రకం వైరసే కారణమని అనుమానిస్తున్నారు. గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లుయెంజా డేటా(జీఐఎస్‌ఏఐడీ) వివరాల ప్రకారం...

Published : 26 Oct 2021 18:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ వైరస్‌ మరో ఉత్పరివర్తనం చెంది ప్రస్తుతం ‘ఏవై.4.2’ వేరియంట్‌ రూపంలో వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు ఈ రకం వైరసే కారణమని అనుమానిస్తున్నారు. గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లుయెంజా డేటా(జీఐఎస్‌ఏఐడీ) వివరాల ప్రకారం.. భారత్‌లోనూ ఇప్పటివరకు దాదాపు 17 నమూనాల్లో ‘ఏవై 4.2’ వేరియంట్‌ను గుర్తించారు. అయితే.. ఈ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నా.. ప్రాణాంతకం కాకపోవచ్చని ఐసీఎంఆర్‌ ఎపిడెమియాలజీ విభాగం అధిపతి డా.సమీరన్ పాండ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ విషయమై భయాందోళనలు అవసరం లేదని, అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

‘తీవ్రత అధికమని చెప్పలేం..’

‘ఈ కొత్త రకం వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే సదరు వైరస్ మనుగడ కోసం మానవ కణాలు అవసరం. అయితే.. దీని తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పడం కష్టం. వైరస్‌ తీవ్రత, వేగంగా వ్యాప్తి చెందడం.. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంటే అది సోకిన వ్యక్తికి ఎటూ కదల్లేని పరిస్థితి వస్తుంది. ఆస్పత్రి పాలవడం, మరణం కూడ సంభవించవచ్చు. కానీ.. వైరస్‌ జీవించాలంటే దానికి ఒక హోస్ట్ అవసరం. కాబట్టి, ఇది అంత ప్రాణాంతకం కాదు’ అని పాండ వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని అధ్యయనాలు ఈ వేరియంట్‌ లక్షణాలను మరింత వివరిస్తాయని అని తెలిపారు. యూకే ఆరోగ్య భద్రత సంస్థ ఇటీవల దీన్ని వేరియంట్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ (వీయూఐ-21ఓసీటీ-01)గా పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని