Nepal: ప్రధానిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడి పేరు

నేపాల్ ప్రధానమంత్రిగా ఆ దేశ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బాను నియమించాలని అక్కడి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌ దిగువసభను తిరిగి పునరుద్ధరించాలని....

Published : 12 Jul 2021 23:56 IST

ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం

కాఠ్‌మాండూ: నేపాల్ ప్రధానమంత్రిగా ఆ దేశ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బాను నియమించాలని అక్కడి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌ దిగువసభను తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్రపతి బిద్యా దేవి భండారీకి ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటును రద్దు చేస్తూ మే నెలలో రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఛోలేంద్ర శుంషర్‌ రాణా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం షేర్‌ బహదూర్‌ దేవ్‌బాను ప్రధానిగా నియమించాలని రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేసింది.  జులై 18 సాయంత్రం 5 గంటలకు కొత్త పార్లమెంట్‌ను సమావేశపర్చాలని సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.

నేపాల్‌ రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఐదు నెలల వ్యవధిలోనే రెండుసార్లు ప్రభుత్వం రద్దయ్యింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ తాను తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని ఆపద్ధర్మ ప్రధాని ఓలీ సమర్థించుకున్నారు. న్యాయస్థానాలు ప్రధానిని నియమించలేవని.. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లోకి సుప్రీంకోర్టు తలదూర్చలేదని ఆయన గతంలోనే వ్యాఖ్యానించారు. ప్రధాని ఓలీ సిఫారసు మేరకు నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ కేవలం 5 నెలల వ్యవధిలోనే రెండో సారి మే 22న ప్రభుత్వాన్ని రద్దు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని