పార్టీ నుంచి కేపీ శర్మ ఓలి తొలగింపు!

నేపాల్ రాజకీయ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలికి సొంత పార్టీలోనే చుక్కెదురయ్యింది. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సీపీ) నుంచి ఓలిని........

Published : 25 Jan 2021 01:11 IST

కాఠ్‌మండూ: నేపాల్ రాజకీయ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలికి సొంత పార్టీలోనే చుక్కెదురయ్యింది. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సీపీ) నుంచి ఓలిని బహిష్కరిస్తున్నట్లు పార్టీ చీలిక వర్గం ప్రకటించింది. ఆదివారం సమావేశమైన పార్టీ కేంద్ర కమిటీ.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ సభ్యత్వాన్ని తొలగిస్తున్నటు తెలిపింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్‌ కాజీ శ్రేష్ఠ్‌ వెల్లడించారు.

పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రకటించిన వెంటనే అధికార పార్టీలో చీలిక మొదలైన విషయం తెలిసిందే. ఓలి నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రచండ నేతృత్వంలోని మరో వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. కేవలం నెల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా రెండో సారి భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఓలి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని రెండు రోజుల క్రితమే హెచ్చరించిన ప్రచండ వర్గం.. తాజాగా ఆయనను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న ఓలి.. గత డిసెంబర్‌ 20న నేపాల్‌ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయానికి రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఆమోదం తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్‌ 30, మే 10న పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. మరోవైపు కొంతకాలంగా ఓలి తీరుపై అధికార పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓవైపు దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించడంలో విఫలమవడంతోపాటు, కరోనా సమయలోనూ దేశాన్ని ముందుండి నడిపించలేదనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. మరోవైపు చైనాకు దగ్గర కావడానికి ఓలి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది.

ఇవీ చదవండి..
నేపాల్‌ పార్లమెంట్‌ రద్దుకు ప్రధాని సిఫారసు!
నేపాల్‌ ప్రధాని నోట చర్చల మాట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని