Covid: ఆ దేశంలో మొట్టమొదటి కొవిడ్‌ కేసు నమోదు

కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న విషయం తెలిసిందే. కొత్త కొత్త వేరియంట్లతో.. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతోంది. కట్టడి చర్యలు చేపడుతోన్నా.. వ్యాప్తి చెందుతోంది. ఇదే క్రమంలో వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటినుంచి కొవిడ్‌ రహిత దేశంగా...

Published : 04 Dec 2021 16:16 IST

వెల్లింగ్టన్‌: కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న విషయం తెలిసిందే. కొత్త కొత్త వేరియంట్లతో.. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతోంది. కట్టడి చర్యలు చేపడుతోన్నా.. వ్యాప్తి చెందుతోంది. ఇదే క్రమంలో వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటినుంచి కొవిడ్‌ రహిత దేశంగా ఉన్న కుక్ ఐలాండ్స్‌లో శనివారం మొట్టమొదటి కేసు నమోదు కావడం గమనార్హం. ఇటీవలే కుటుంబంతోసహా ఇక్కడికి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్న ఓ పదేళ్ల బాలుడికి పాజిటివ్‌గా తేలినట్లు ఆ దేశ ప్రధాని మార్క్‌ బ్రౌన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వారు న్యూజిలాండ్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

96 శాతం మందికి రెండు డోసులు..

దాదాపు 17 వేల జనాభా కలిగిన కుక్‌ ఐలాండ్స్‌.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టీకా రేటు కలిగి ఉన్న దేశాల్లో ఒకటి. పసిఫిక్‌ మహాసముద్రంలోని ఈ ద్వీప దేశంలో అర్హులైనవారిలో దాదాపు 96 శాతం మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభంలోనే ఈ దేశం.. ఇతర దేశాలతో రాకపోకలు తెంచుకుంది. ఇటీవలే జనవరి 14 నుంచి న్యూజిలాండ్‌తో క్వారంటైన్‌ రహిత ప్రయాణాలను పునఃప్రారంభించే విషయమై ప్రణాళికలు ప్రకటించింది. ఇదే తరుణంలో మొదటి కేసు బయటపడింది. ‘పర్యాటకుల కోసం సరిహద్దులను తిరిగి తెరిచేందుకు సన్నద్ధమవుతున్న వేళ మొదటి కేసును పట్టుకోవడం.. మా అప్రమత్తత తీరును చూపుతోంది’ అని ప్రధాని బ్రౌన్ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని