Published : 01/10/2021 02:14 IST

trump: ట్రంప్‌నకు వెన్నుపోటు పొడిచిన ఆర్మీ జనరల్‌..!

చైనా జనరల్‌కు ఫోన్‌.. మార్క్‌మిల్లీ నిర్వాకం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఓ అమెరికా జనరల్‌ దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్‌కు ఫోన్‌ చేసి ముందే చెప్పేశారు. కొన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చింది.. దీంతో యుద్ధాన్ని నివారించేందుకు అలా చేశానని ఇప్పుడా జనరల్‌ తాను చేసిన పని సమర్థించుకొంటున్నారు. అతనికి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆ జనరల్‌ అమెరికా కాంగ్రెస్‌ విచారణకు హాజరుకావడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది. 

ఏమి జరిగింది..?

ట్రంప్‌ హయాంలో అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్ స్టాఫ్‌గా మార్క్‌ మిల్లీని నియమించారు. అదే సమయంలో అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ విషయంలో ట్రంప్‌ చైనాపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ విషయాన్ని మార్క్‌ మిల్లీ గమనించారు. ఆయన చైనాపై అణు దాడి చేయవచ్చని ఊహించుకున్నారు. అక్టోబర్‌ 30వ తేదీన చైనా జనరల్‌ లీ జూఛెంగ్‌కు ఫోన్‌ చేశారు.  తమ అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని.. యుద్ధం ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వొచ్చని వెల్లడించాడు. చైనా వెంటనే ప్రతిదాడి చేయవద్దని కోరారు. అనంతరం జనవరి 8వ తేదీన మార్క్‌ మిల్లీ మరోసారి చైనా జనరల్‌కు ఫోన్‌ చేశారు. ట్రంప్‌ పదవిని వీడే సమయంలో దాడికి ఆదేశాలు ఇవ్వొచ్చనే విషయాన్ని వెల్లడించాడు. తనకు ఆదేశాలు వస్తే ముందే వెల్లడిస్తానని చైనా జనరల్‌కు చెప్పారు. అంతేకాదు కీలక అమెరికా సైనిక జనరల్స్‌ను సమావేశపర్చి ట్రంప్‌ ఆదేశాలను వెంటనే అమలు చేయవద్దని సూచించారు. ఈ విషయం మొత్తం బాబ్‌ ఉడ్‌వర్డ్‌, రాబర్ట్‌ కోస్టాలు రాసిన ‘పెరల్‌’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. మార్క్‌ మిల్లీ నైతికంగా నేరస్థుడని రచయితలు అభిప్రాయపడ్డారు. ఉడ్‌వర్డ్‌ ఈ పుస్తకం రాసేందుకు గతంలో మార్క్‌ మిల్లీని  ఇంటర్వ్యూ చేశారు. దీంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ట్రంప్‌ ఈ విషయం తెలిసి మండిపడ్డారు. ఈ కాల్స్‌ చేయడానికి అధ్యక్షుడి నుంచి మిల్లీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు.  

మిల్లీ ఏమంటున్నారు..?

తాజాగా సెనెట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీస్‌ కమిటీ అఫ్గాన్‌ పరిణామాలతో సహా పలు అంశాలపై విచారణ చేపట్టింది. ఈ కమిటీలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు సభ్యులుగా ఉంటారు. వీరు మార్క్‌ మిల్లీని ఫోన్‌కాల్స్‌పై ప్రశ్నించారు. ‘ఆ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించడం నా కర్తవ్యం’ అని మిల్లీ సెనెటర్లకు వివరించారు. ట్రంప్‌నకు అలాంటి ఉద్దేశం లేదనే విషయం తనకు తెలుసునని పేర్కొనడం విశేషం. అంతేకాదు తాను ఫోన్ కాల్స్‌ చేసిన విషయం ట్రంప్‌ కార్యవర్గంలోని చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మెడోస్‌, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో, డిఫెన్స్‌ సెక్రటరీ మార్కె ఎస్పర్‌లకు తెలుసని చెప్పారు. అదే సమయంలో జనవరి 8వ తేదీన స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఫోన్‌కాల్‌ విషయాన్ని కూడా వెల్లడించారు. పెలోసీ కూడా అధ్యక్షుడు అణ్వాయుధాలను వాడే సామర్థ్యంపై ప్రశ్నించారని చెప్పారు. అణ్వాయుధాల వాడకానికి ఒక విధానం ఉందని.. దానిని మినహాయించి.. చట్టవిరుద్ధంగా, ప్రమాదవశాత్తు వాటిని వినియోగించకుండా చేస్తానని పెలోసికి చెప్పినట్లు మిల్లీ వివరించారు. 

వెనకేసుకొస్తున్న శ్వేతసౌధం..

మిల్లీ చర్యలపై రిపబ్లికన్లు మండిపడుతున్నారు. అతను రాజీనామా చేయడం కానీ, అధ్యక్షుడు అతన్ని తొలగించడం కానీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సెనెటర్‌ మార్కో రూబియో ఈ మేరకు బైడెన్‌కు ఓ లేఖ కూడా రాశారు. దీనిపై శ్వేత సౌధం స్పందిస్తూ అధ్యక్షుడు బైడెన్‌కు మిల్లీపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. మిల్లీని.. ట్రంప్‌ ఆర్మీ చీఫ్‌గా నియమించారు. ఆ తర్వాత ఆయన్ను జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమించారు. బైడెన్‌ మిల్లీని కొనసాగించారు. ప్రస్తుతం బైడెన్‌ సలహాదారుల్లో మిల్లీ కూడా ఒకరు.

అఫ్గానిస్థాన్‌ గందరగోళం బైడెన్‌ పనే..!

సెనెట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీస్‌ కమిటీ విచారణ సందర్భంగా అఫ్గాన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ కమిటీ మిల్లీతోపాటు సెంట్‌ కామ్‌ కమాండర్‌ మెకంజీని కూడా ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భంగా వారు  తాము అఫ్గాన్‌లో 2,500 మంది సైనికులను ఉంచమని అధ్యక్షుడికి చెప్పామన్నారు. తర్వాత శ్వేతసౌధం ప్రతినిధి జెన్‌సాకీ మాట్లాడుతూ ‘‘అధ్యక్షుడు జనరల్స్‌ సలహాలకు విలువిస్తారు. అలాగని వారుచెప్పిన దాంతో ఏకీభవిస్తారని అనుకోవద్దు’’ అని పేర్కొన్నారు.

వాస్తవానికి ఆగస్టు 19న జో బైడెన్‌ ఓ ఆంగ్ల పత్రికా విలేకరితో మాట్లాడుతూ అఫ్గాన్‌లో స్వల్ప సంఖ్యలో దళాలను కొనసాగించాలనే అంశంపై తనకు ఎవరూ సలహా ఇచ్చినట్లు గుర్తుకు రావడంలేదని అనడం గమనార్హం. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని