దండకారణ్యంలో దడ

దట్టమైన కీకారణ్యం.. కొండలూ, గుట్టలతో నిండి ఉండటం.. స్థానిక గిరిజనుల నుంచి మద్దతు..

Published : 10 Apr 2021 12:40 IST

రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఘటనలు

హైదరాబాద్‌: దట్టమైన కీకారణ్యం.. కొండలూ, గుట్టలతో నిండి ఉండటం.. స్థానిక గిరిజనుల నుంచి మద్దతు..  దండకారణ్యంలో మావోయిస్టుల పెత్తనం కొనసాగడానికి ఇవీ కొన్నికారణాలు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని కట్టడి చేయగలిగినప్పటికీ.. దండకారణ్యం మాత్రం తన విభిన్నతలతో ప్రభుత్వాలకు కొరుకుడు పడటంలేదు. మావోయిస్టుల తాజా మెరుపుదాడి నేపథ్యంలో దేశం దృష్టి ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని ఈ కీకారణ్యంపైనే కేంద్రీకృతమైంది. ఇది రాష్ట్రానికి ఆనుకొని ఉండటం, అటువైపు నుంచి అవకాశం చిక్కినప్పుడల్లా మావోయిస్టులు రాష్ట్రంలోకి జొరబడుతుండటం, అన్నింటికీ మించి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా అనేక మంది తెలుగువారే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అంశం రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 

దేశంలో గత పదేళ్లలో వామపక్ష తీవ్రవాదం తాలూకూ హింస చాలావరకూ తగ్గింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2010లో దేశంలో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి 2,213 హింసాత్మక ఘటనలు జరగ్గా 1,005 మంది మరణించారు. 2019 నాటికి ఘటనలు 670కి, మరణాలు 202కి తగ్గాయి. అప్పట్లో మొత్తం పది రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండగా ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో వామపక్ష కార్యకలాపాలు నామమాత్రంగానే ఉన్నాయి. తీవ్రవాదంపై పోరులో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలు చాలా పరిమితమయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో 2010లో 625 ఘటనలు, 343 మరణాలు సంభవిస్తే 2019 నాటికి అవి వరుసగా 263, 77కు చేరుకున్నాయి. ఇక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడానికి ప్రధాన కారణం దండకారణ్యమే.  దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. మిగతా రాష్ట్రాల నుంచి బలగాలను ఉపసంహరించి ఛత్తీస్‌గఢ్‌కు పంపుతోంది. దండకారణ్యంలో పరిస్థితి అదుపులోకి రాకపోతే దీని ప్రభావం మిగతా రాష్ట్రాలపైనా ఉంటుందనడంలో సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఎలా ఉందో చెప్పడానికి దండకారణ్యమే కొలమానంగా మారింది. తమకు పెట్టనికోటలా మారిన ఈ అరణ్యంలో తిష్టవేసిన మావోయిస్టులు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఇటీవలి ఘటన తరహాలో మెరుపుదాడులకు దిగుతున్నారు. మిగతా రాష్ట్రాల్లోకి చొచ్చుకెళ్లడంతోపాటు ఆయా రాష్ట్రాల క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త నియామకాలపై దృష్టి పెట్టి, ఆకర్షితులైన వారికి శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదెల్లు అలియాస్‌ భాస్కర్‌ నియామకాల కోసమే ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చాలాకాలం సంచరించాడు. పోలీసులు అప్రమత్తమయ్యే సరికి మళ్లీ దండకారణ్యంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి ఎప్పుడైనా ముప్పు ముంచుకు రావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. సరిహద్దుల్లో నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. వామపక్ష తీవ్రవాదం కట్టడిలో అనుభవం ఉన్న సిబ్బందిని ఇక్కడ ప్రత్యేకంగా నియమించారు. అయితే ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలుగానే పనికి వస్తాయి తప్ప ముప్పుని పూర్తిస్థాయిలో నివారించలేవనే భావన వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని