Security Agencies: విద్యార్థులుగా వెళ్లి.. ఉగ్రవాదులుగా వస్తున్నారు!

పాకిస్థాన్‌లో చదువుకునేందుకు వెళ్లిన కొందరు కశ్మీరీ విద్యార్థులు ఉగ్రవాదులుగా మారి స్వదేశానికి వస్తున్నారని అధికారులు గుర్తించారు. తాజాగా ఎన్‌కౌంటర్‌కు గురైన ఉగ్రవాది షకీర్‌ అల్తాఫ్‌ భట్‌ కూడా విద్యార్థి వీసాపై 2018లో పాక్‌కు వెళ్లాడని జమ్ము కశ్మీర్‌ అధికారులు ఆదివారం స్పష్టం చేశారు. 2015 నుంచి

Published : 02 Aug 2021 01:18 IST

శ్రీనగర్‌: పాకిస్థాన్‌లో చదువుకునేందుకు వెళ్లిన కొందరు కశ్మీరీ విద్యార్థులు ఉగ్రవాదులుగా మారి స్వదేశానికి వస్తున్నారని అధికారులు గుర్తించారు. తాజాగా ఎన్‌కౌంటర్‌కు గురైన ఉగ్రవాది షకీర్‌ అల్తాఫ్‌ భట్‌ కూడా విద్యార్థి వీసాపై 2018లో పాక్‌కు వెళ్లాడని జమ్ము కశ్మీర్‌ అధికారులు ఆదివారం స్పష్టం చేశారు. 2015 నుంచి 2019 వరకు పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్‌ వెళ్లిన 40 మందిలో 28 మంది ఉగ్రవాదులుగా శిక్షణ పొంది భారత్‌కు వచ్చినట్లు సెక్యూరిటీ ఏజెన్సీలు వెల్లడించాయి. ఆ విద్యార్థుల పాస్‌పోర్టుల వివరాల ప్రకారం ఈ విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నాయి.

గత మూడేళ్ల కాలంలో.. స్వల్పకాలిక వీసాలపై పాకిస్థాన్‌కు వెళ్లిన 100 మంది కశ్మీరీ యువకులు కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. అయితే వారిలో కొందరు భారత్‌కు తిరిగి వచ్చినా కనిపించడం లేదన్నారు. కనిపించకుండా పోయిన వారు సరిహద్దుల్లో ఉంటూ ఉగ్రవాద సంస్థలకు స్లీపర్‌ సెల్స్‌గా లేదా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సెక్యూరిటీ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతేడాది ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ మధ్యలో ఉగ్రవాదులతో కలిసి కొంతమంది యువకులు భారత్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ యువకులు దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్, కుల్గామ్, అనంత్‌నాగ్ జిల్లాలకు చెందిన వారని.. వారు గతంలోనే పాకిస్థాన్‌ వెళ్లి తిరిగి రాలేదని వివరించారు.

మరోవైపు పైచదువుల కోసం పాకిస్థాన్‌ లేదా బంగ్లాదేశ్‌కు వెళ్లిన 40 మంది కాశ్మీరీ యువత, వారి కుటుంబాలు కనిపించకపోవడంతో భద్రతా ఏజెన్సీలు నిఘాను పెంచాయి. ఇమ్మిగ్రేషన్‌ అధికారులతో కలిసి వాఘా సరిహద్దు,  న్యూ దిల్లీ విమానాశ్రయంలో సెక్యూరిటీ ఏజెన్సీలు భారీ కసరత్తు చేపట్టాయి. ఇందులో భాగంగా గత మూడేళ్ల కాలంలో వారం రోజుల గడువు వీసాలపై పాక్‌కు వెళ్లిన కశ్మీరీ యువకులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పాక్‌కు ఎందుకు వెళ్లారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో క్షుణ్నంగా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు పాస్‌పోర్ట్ సహా ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ధ్రువీకరణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ బ్రాంచ్, వెరిఫికేషన్ ఏజెన్సీలను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆదేశించారు. పాస్‌పోర్టు తీసుకునే వ్యక్తి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాడా? గతంలో రాళ్ల దాడికి పాల్పడ్డాడా? అనే విషయాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని సూచించారు. అలాంటి చర్యలకు పాల్పడితే వారికి ధ్రువీకరణ ప్రతాలు మంజూరు చేయకూడదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని