మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఆయన పంపించారు.

Updated : 05 Apr 2021 15:49 IST

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్‌ఠాక్రేకు పంపించారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన నేపథ్యంలో రాజీనామా చేయడం గమనార్హం. నైతికపరమైన కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తనపై విచారణ జరుగుతున్నందున హోంమంత్రి పదవిలో కొనసాగడం ఇష్టంలేదని ముఖ్యమంత్రికి పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గత కొన్నివారాలుగా తనపై అవినీతి ఆరోపణల్ని ఖండించిన ఆయన రాజీనామా డిమాండ్లను తోసిపుచ్చారు. తానేమీ తప్పుచేయలేదని పేర్కొన్నారు. 

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్‌ వాజేకు దేశ్‌ముఖ్‌ ప్రతి నెలా రూ.100 కోట్లు వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని