72 దేశాలకు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ టీకాలు!

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 72 దేశాలకు భారత్‌లో తయారైన వ్యాక్సిన్లను సరఫరా చేసినట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది.

Published : 17 Mar 2021 20:43 IST

భారత ఖ్యాతి మరింత పెరిగిందన్న విదేశాంగశాఖ

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 72 దేశాలకు భారత్‌లో తయారైన వ్యాక్సిన్లను సరఫరా చేసినట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. దీంతో ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌’ పేరుగాంచిన భారత ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మరింత బలపడిందని పేర్కొంది. ‘వ్యాక్సిన్‌ మైత్రి’లో భాగంగా వివిధ దేశాలకు సరఫరా చేస్తోన్న భారత టీకాల సమాచారాన్ని కేంద్ర విదేశాంగశాఖ రాజ్యసభలో వెల్లడించింది.

‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌గా పేరుగాంచిన భారత ఖ్యాతి వ్యాక్సిన్‌ సరఫరాతో మరింత బలపడింది. దీంతో భారత్‌లో తయారయ్యే(మేడ్‌ ఇన్‌ ఇండియా) వస్తువులపై ప్రపంచవ్యాప్తంగా మరింత నమ్మకం ఏర్పడింది. వాక్సిన్‌లకంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద దేశాలకు మనం అవలంభించిన విధానాలు ఎంతో బలన్నిచ్చాయి’ అని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ రాజ్యసభలో పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో విదేశాలకు ఔషధాలు, వ్యాక్సిన్‌లు అందించగలిగే సత్తా ఓ పెద్ద దేశానికి ఉందనే విషయం భారత్‌ను చూసి ఆయా దేశాలు నమ్ముతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘వ్యాక్సిన్‌ మైత్రి’ తొలుత పొరుగు దేశాలైన మాల్దీవులు, భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, మయన్మార్‌, మారిషస్‌, గల్ఫ్‌ దేశాలతోనే ప్రారంభమైందని కేంద్ర విదేశాంగ మంత్రి గుర్తుచేశారు. ఓవైపు దేశ‌ అవసరాలకు అనుగుణంగా టీకా పంపిణీ చేస్తూనే, మరోవైపు విదేశాలకు సరఫరా చేయడంపై దృష్టి సారించామని జయశంకర్‌ తెలిపారు.

ఇలా భారత్‌లో తయారైన వ్యాక్సిన్లను ఇప్పటివరకు 72 దేశాలకు సరఫరా చేశామని భారత విదేశాంగశాఖ మంత్రి వెల్లడించారు. వీటిలో కొన్ని నేరుగా సరఫరా చేయడంతో పాటు మరికొన్ని ప్రైవేటు ఒప్పందాల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథ్యంలో ఏర్పాటైన కొవాక్స్‌ కూటమికి భారత్‌ వ్యాక్సిన్‌లను అందిస్తోందన్నారు. వీటితో పాటు కొవిడ్‌ సంక్షోభం వేళ 150 దేశాలకు ఔషధాలను సరఫరా చేశామని, వీటిలో 82 దేశాలకు భారత్‌ ఉచితంగా వివిధ ఔషధాలు అందించిందని తెలిపారు. అంతేకాకుండా భారత్‌లో తయారుచేసిన మాస్కులు, పీపీఈ కిట్లు, పరీక్షా పరికరాలను కూడా ఇతర దేశాలకు అందుబాటులో ఉంచామన్నారు. ఇలా అనేక విధాల్లో కరోనా వైరస్‌ మహమ్మారిపై ప్రపంచ దేశాలు చేస్తోన్న పోరులో భారత్‌ చర్యలు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని