Karnataka: బెంగళూరులో వింత శబ్దాలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

కర్ణాటక రాజధాని బెంగళూరు ఒక్కసారిగా భారీ వింత శబ్దాలతో ఉలిక్కిపడింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెంగళూరూతో పాటు మండ్య, రమణనగర ప్రాంతాల్లో వచ్చిన భారీ వింత శబ్దాలకు నగరవాసులు ఆందోళనకుగురయ్యారు

Published : 27 Nov 2021 01:14 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు ఒక్కసారిగా వింత శబ్దాలతో ఉలిక్కిపడింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెంగళూరూతో పాటు మండ్య, రమణనగర ప్రాంతాల్లో వచ్చిన వింత శబ్దాలకు నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇది భూకంపమా లేదా  సూపర్ సోనిక్ బూమ్‌ సంకేతాలా?అంటూ ట్విటర్‌ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు. కాగా  బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరంలో వినిపించిన భారీ శబ్దాలకు ఇంటి తలుపులు, కిటికీలు ఊగిపోయాయి. ఇలాంటి ఘటనలు అక్కడేమీ కొత్తకాదు. గతంలోనూ ఇలాంటి శబ్దాలకు భూప్రకంపనలకు సంబంధం లేదని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది. ఈ  వింత శబ్దాలను సెసిమిక్ అబ్జర్వేటరీలతో విశ్లేషించగా వాటిలో భూకంప సంకేతాలు కనిపించలేదని తేల్చింది. దీంతో కర్ణాటక వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ శబ్దాలకు గల కారణాలేమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. బెంగళూరులో ఇలాంటి వింత శబ్ధాలు వినిపించడం ఇదేమీ మొదటిసారికాదు. 2020 మేలోనూ ఇలాంటి భారీ శబ్దాలు వినిపించాయి. దీనికి కారణం యుద్ధ విమానం పరీక్షిస్తున్నప్పుడు వచ్చిన శబ్దాలేనని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌) స్పష్టత ఇచ్చింది. ఇదే ఏడాది జులైలోనూ బెంగళూరు నగరంలోనూ భారీ శబ్దాలు వినిపించగా వీటికి ప్రత్యేక కారణాలేవీ లేవని హెచ్‌ఏఎల్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని