KitKat: నెస్లే కిట్‌కాట్‌ చాక్లెట్లపై దేవుడి బొమ్మలు..క్షమాపణలు చెప్పిన సంస్థ

ప్రముఖ చాక్లెట్‌ కంపెనీ ‘నెస్లే ఇండియా’ వివాదంలో చిక్కుకుంది. నెస్లే బ్రాండ్‌కు చెందిన ‘కిట్‌ కాట్’చాక్లెట్‌ (రేపర్‌) కవర్లపై దేవుడి బొమ్మలను ముద్రించడంతో  సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ కంపెనీపై విమర్శలు

Updated : 21 Jan 2022 05:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ చాక్లెట్‌ కంపెనీ ‘నెస్లే ఇండియా’ వివాదంలో చిక్కుకుంది. నెస్లే బ్రాండ్‌కు చెందిన ‘కిట్‌ కాట్’చాక్లెట్‌ (రేపర్‌) కవర్లపై దేవుడి బొమ్మలను ముద్రించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ కంపెనీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నెస్లే కంపెనీ వెంటనే క్షమాపణలు చెప్పింది. ఆ చాక్లెట్లను వెనక్కి తెప్పిస్తున్నట్టు వెల్లడించింది.

‘కిట్‌ కాట్’ చాక్లెట్‌ రేపర్‌పై నెస్లే కంపెనీ జగన్నాథస్వామితో పాటు బలభద్ర, సుభద్ర మాతా చిత్రాలను ముద్రించింది. దీనిపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మత విశ్వాసాలకు ఇబ్బంది కలిగించేలా ఉందని సదరు కంపెనీపై సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తిపోశారు. దేవుళ్ల చిత్రాలు ఉన్న ఈ చాక్లెట్లను తిన్న తర్వాత ఆ రేపర్లను రోడ్లు, చెత్త బుట్టలు, మురికి కాలువల్లో పడేస్తారని, కాబట్టి దేవుళ్ల బొమ్మల ముద్రణను ఆపేయాలని కొందరు డిమాండ్‌ చేశారు. దీంతో సదరు కంపెనీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

‘ఒడిశా సంప్రదాయాన్ని ఇతర ప్రాంతాలకూ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. కళను, కళాకారులను ప్రోత్సహించాలనే మా ఉద్దేశం. ఇదెంత సున్నితమైన అంశమో మేం అర్థం చేసుకోగలం. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. చింతిస్తున్నాం’ అని నెస్లే ట్విటర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ చాక్లెట్‌ ప్యాక్‌లను తక్షణమే మార్కెట్‌ నుంచి వెనక్కి తెప్పించే చర్యలను ప్రారంభించామని పేర్కొంది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని