పార్లమెంటులో రెండో రోజూ వాయిదాల పర్వం.. 

పార్లమెంట్‌ ఉభయ సభలను చమురు ధరల పెరుగుదల అంశం రెండో రోజూ కుదిపేసింది. దీంతో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎలాంటి.....

Published : 09 Mar 2021 22:45 IST

దిల్లీ: చమురు ధరల పెరుగుదల అంశం పార్లమెంట్‌ ఉభయ సభలను రెండో రోజూ కుదిపేసింది. దీంతో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్ష సభ్యులు తమ సీట్లలోంచి లేచి పెరిగిన ఇంధన ధరలపై చర్చకు పట్టుబట్టారు. విపక్ష సభ్యుల విజ్ఞప్తిని స్పీకర్‌ ఓంబిర్లా తిరస్కరించి ప్రశ్నోత్తరాలు కొనసాగించేందుకు ప్రయత్నించారు. దీంతో విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అడుగడుగునా అడ్డు తగిలారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు సభ్యులు సభలోనే నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళనతో సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి.. ఆ తర్వాత మధ్యాహ్నం 2గంటల వరకు మరోసారి సభ వాయిదా పడింది. మళ్లీ తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభాపతి ఓం బిర్లా లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ వాయిదాల పర్వం

మరోవైపు, రాజ్యసభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.  దీంతో సభ తొలుత 11.20 నిమిషాల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ సమావేశమైన సభలో సభ్యులు నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 2గంటల వరకు మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్‌ రేపటికి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని