Lakhimpur Kheri: లఖింపుర్‌ ఘటనలో ఎంతమందిని అరెస్టు చేశారు? సుప్రీం ప్రశ్న

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ ఘటనలో ఎంతమందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు?

Updated : 07 Oct 2021 14:16 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ ఘటనలో ఎంతమందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారని యూపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై స్టేటస్ రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 

లఖింపుర్‌ ఖేరిలో గత ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్‌ త్రిపాఠిÈ, సీఎస్‌ పాండా అనే ఇద్దరు న్యాయవాదులు సీజేఐ జస్టిస్‌ రమణకు లేఖ రాశారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ జరిపింది. 

‘‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. రైతులు ఇతర వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో అసలు నిందితులు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎంతమందిపై కేసులు పెట్టారు? అందులో ఎంతమందిని అరెస్టు చేశారు? దీనిపై స్టేటస్‌ రిపోర్టును దాఖలు చేయండి’’ అని యూపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై యూపీ ప్రభుత్వం స్పందిస్తూ.. ఘటనపై దర్యాప్తునకు సిట్‌తో పాటు న్యాయ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. శుక్రవారం ఆ నివేదికను సమర్పిస్తామని పేర్కొంది. 

స్టేటస్‌ నివేదిక దాఖలు చేసేందుకు యూపీ ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ను ఈ సందర్భంగా కోర్టు సూచించింది. మరోవైపు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతు లవ్‌ప్రీత్‌సింగ్ తల్లికి ఉన్నత స్థాయి వైద్యం అందించాలని యూపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ... లఖింపుర్‌ ఖేరి జిల్లాలోని తికోనియా-బన్బీర్‌పుర్‌ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారు, మరో వాహనం దూసుకెళ్లడం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు చనిపోవడం.. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆశిష్‌ మిశ్రా సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇంతవరకూ నిందితులను అరెస్టు చేయకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని