Omicron: మోదీజీ ఆ దేశాల నుంచి విమానాలు ఆపండి: కేజ్రీవాల్‌

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆ వేరియంట్‌ భారత్‌లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని దిల్లీ

Updated : 27 Nov 2021 16:10 IST

దిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆ వేరియంట్‌ భారత్‌లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. ఆయా దేశాల నుంచి తక్షణమే విమానాల రాకపోకలను నిలిపివేయాలని ట్విటర్‌ వేదికగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించారు. 

‘‘ఎన్నో వ్యయప్రయాసలను ఓర్చి మన దేశం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంది. ఈ సమయంలో కొత్త వేరియంట్‌(ఒమిక్రాన్‌) దేశంలోకి ప్రవేశించకుండా సాధ్యమైన అన్ని చర్యలు చేపట్టాలి. కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూసిన దేశాల నుంచి భారత్‌కు విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని ప్రధానిని కోరుతున్నా’’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ నేడు అధికారులతో కీలక భేటీ జరపనున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఈ అభ్యర్థన చేశారు. 

ఒమిక్రాన్‌ వేరియంట్‌.. యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతోన్న వేళ.. ఈ వేరియంట్‌ మరో ఉద్ధృతికి దారితీయొచ్చన్న అనుమానాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా సహా ఇజ్రాయెల్‌, బోట్స్‌వానా, హాంకాంగ్‌ల్లో ఈ రకం కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ మళ్లీ ప్రయాణ ఆంక్షలను మొదలుపెట్టాయి. ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి.

ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. డిసెంబరు 15 నుంచి తిరిగి అంతర్జాతీయ సర్వీసుల అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. అయితే కొత్త వేరియంట్ నేపథ్యంలో యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌పై మాత్రం ఆంక్షలు విధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని