Kabul Airport: కాబుల్‌లో పునఃప్రారంభమైన విమాన సర్వీసులు

కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్ విమానాశ్రయం తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే దేశీయ విమాన సర్వీసులను మాత్రమే.....

Published : 06 Sep 2021 01:11 IST

కాబుల్‌: అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం కొద్ది రోజులపాటు సర్వీసులు నిలిచిపోయిన కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్ విమానాశ్రయం తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే దేశీయ విమాన సర్వీసులను మాత్రమే నడపనున్నట్లు ఎయిర్లైన్స్ స్టేషన్ మేనేజర్ మీడియాకు తెలిపారు. అరియానా అప్గాన్ విమాన సంస్థ కాబూల్ నుంచి మూడు ప్రావిన్స్‌లకు విమాన సర్వీసులను నడపనున్నట్లు పేర్కొన్నారు. హెరాత్, దక్షిణ కాందహార్, ఉత్తర బల్క్ ప్రావిన్స్‌లకు ప్రయాణికులను తీసుకెళ్లనున్నట్లు వివరించారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

అఫ్గాన్‌లో 20 ఏళ్ల నుంచి సేవలందిస్తున్న తమ దేశ మిలటరీని అమెరికా  తరలించింది. ఈ నేపథ్యంలోనే యూఎస్ మిలటరీ జనరల్ మాట్లాడుతూ.. యుద్ధంలో అమెరికాకు సహకరించిన అఫ్గాన్ పౌరులను తరలించేందుకు కృషి చేసిన10వ మౌంటెయిన్ డివిజన్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారు అందించిన సహకారంతోనే దాదాపు 1.24 లక్షల మందిని విమానాల్లో సురక్షితంగా తరలించినట్లు మిలటరీ జనరల్ పేర్కొన్నారు.

ఆగస్టు నెలాఖరులో అమెరికన్‌ బలగాల నిష్ర్కమణతో హమీద్‌ కర్జాయ్ ఎయిర్‌పోర్ట్‌ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి దీన్ని మూసిఉంచారు. ఆగస్టు 30 అర్ధరాత్రి అమెరికాకు చెందిన ఆఖరు విమానం ‘లార్జ్‌ సీ-17’ ఇక్కడి నుంచి టేకాఫ్‌ అయింది. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించిన అనంతరం.. అఫ్గాన్‌ను వదిలి వెళ్లేందుకు వేలాది మంది ప్రజలు ఈ విమానాశ్రయానికి పోటెత్తారు. కాల్పులు, తొక్కిసలాటలు, బాంబు పేలుళ్లతో విమానాశ్రయంతోపాటు పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగాయి. అమెరికా, భారత్‌ తదితర దేశాలు తమ పౌరులను తరలించేందుకు భారీ సంఖ్యలో విమానాలు నడిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని