గల్లంతైన భార్య కోసం పదేళ్లుగా అన్వేషణ!

జపాన్‌లో విధ్వంసం సృష్టించిన భూకంపం.. సునామీ విపత్తుకు నిన్నటితో దశాబ్దం. పదేళ్ల కిందట అంటే 2011 మార్చి 11న తోహోకు ప్రాంతంలో సంభవించిన భూకంపం జపాన్‌ను వణికించగా.. దాని కారణంగా పుట్టుకొచ్చిన సునామీ ఆ దేశాన్ని వరదలతో ముంచేసింది. ఈ ప్రకృతి విపత్తులో

Published : 13 Mar 2021 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌లో విధ్వంసం సృష్టించిన భూకంపం.. సునామీ విపత్తుకు నిన్నటితో దశాబ్దం. పదేళ్ల కిందట అంటే 2011 మార్చి 11న తోహోకు ప్రాంతంలో సంభవించిన భూకంపం జపాన్‌ను వణికించగా.. దాని కారణంగా పుట్టుకొచ్చిన సునామీ ఆ దేశాన్ని వరదలతో ముంచేసింది. ఈ ప్రకృతి విపత్తులో 15వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశానికి రూ.లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల్లో గల్లంతైన వారి కోసం ప్రభుత్వం ఎంతగానో అన్వేషించింది. కొందరి మృతదేహాలు లభ్యం కాగా.. ఇప్పటికీ దాదాపు 2,500మందికిపైగా ఆచూకీ తెలియలేదు. వారిలో యాసు టకామాత్సు భార్య యూకు కూడా ఉంది. వెతికి వేసారి ప్రభుత్వం వారిని మరణించినట్లు ప్రకటించినా 64 ఏళ్ల టకామాత్సు మాత్రం పదేళ్లుగా తన అర్ధాంగి జాడ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. ఆమె చనిపోయినా.. మృతదేహామైన దొరక్కపోదా? చివరి చూపు అయినా చూసుకోకపోతానా? అనే ఆశాభావంతో.. అంతులేని ఆవేదనతో సముద్రాన్ని జల్లెడ పడుతున్నాడు.

జపాన్‌కు తీవ్ర వేదన మిగిల్చిన ఆ భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 9గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో సునామీ జపాన్‌పై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఒనగావా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో టకామాత్సు సతీమణి యూకు కొట్టుకుపోయింది. సునామీ ప్రభావం తగ్గిన తర్వాత రెస్క్యూ సిబ్బంది గల్లంతైన వారి కోసం వెతకటం మొదలుపెట్టింది. కానీ, యూకు జాడ లభించలేదు. కొన్నిరోజులకు ప్రభుత్వం సహాయకచర్యలు నిలిపివేసింది. దీంతో స్వయంగా తనే ఎలాగైనా తన భార్య ఆచూకీ కనిపెట్టాలని టకామాత్సు నిర్ణయించుకున్నాడు.

పర్వతాలు.. అడవులు.. ఆపై సముద్రం

వరదల్లో కొట్టుకుపోయే ముందు చివరిసారిగా యూకు ఎక్కడ ఉందో ఆ చోటుకు సమీపంలో ఉన్న పర్వతాలు, అడవులు అన్నింటిని ఏడాదిన్నర పాటు టకామాత్సు గాలించాడు. అయినా, యూకు ఆచూకీ దొరకలేదు. ఇక వెతకడానికి మిగిలింది సముద్రమే. అందుకే సముద్రంలో లోతుగా వెళ్లి వెతకడానికి వీలుగా డైవింగ్‌ నేర్చుకున్నాడు. కొన్ని నెలల పాటు కఠోర శిక్షణ తీసుకొని డైవింగ్‌లో నైపుణ్యం సాధించాడు. అప్పటి నుంచి వారాంతాల్లో సముద్రంలో దూకి తన భార్య కోసం అన్వేషిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 500సార్లు డైవింగ్‌ చేశాడట. అతడు ఏయే ప్రాంతాలను వెతికాడు, ఎంత లోతులో వెతికాడు, ఇంకా ఏయే ప్రాంతాలను వెతకాలి వంటి విషయాలను డైవింగ్‌ ట్రైనర్‌ రికార్డు చేస్తున్నాడు. ఈ అన్వేషణలో గల్లంతైన ఎంతో మంది వస్తువులు దొరుకుతున్నాయి. కానీ, యూకుకి సంబంధించిన చిన్న ఆధారం కూడా లభించట్లేదు. అయినా సరే, తన శరీరం సహకరించినంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన భార్య కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటానని స్పష్టం చేస్తున్నాడు. టకామాత్సు సంకల్పం నెరవేరాలని ఆయన గురించి తెలిసిన వ్యక్తులు కాంక్షిస్తున్నారు. గల్లంతై బతికుందో లేదో తెలియని భార్య ఆచూకీ కోసం తాపత్రయపడతున్న భర్త ప్రేమ ఎంత గొప్పదో కదా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని