Vaccine: గర్భిణులు టీకా తీసుకోవచ్చా..?

గర్భిణులు నిరభ్యరంతంగా వ్యాక్సిన్‌లు తీసుకోవచ్చని ప్రముఖ సంస్థలు పేర్కొంటున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఓజీఎస్‌ఐ)....

Published : 05 Jun 2021 01:19 IST

బెంగళూరు: కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటిని గర్భిణులపై పరీక్షించలేదు. గర్భిణులు టీకా వేసుకోవచ్చా? లేదా? అనే సందిగ్ధత ఇంకా ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే గర్భిణులు నిరభ్యరంతంగా వ్యాక్సిన్‌లు తీసుకోవచ్చని ప్రముఖ సంస్థలు పేర్కొంటున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఓజీఎస్‌ఐ), ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్ (ఎఫ్‌ఐజీఓ) వంటి ప్రముఖ సంస్థలు గర్భిణులతోపాటు పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవచ్చని వెల్లడిస్తున్నాయి.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సంతానోత్పత్తి వైద్యురాలు, రాధాకృష్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విద్య వి భట్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. గర్భిణులు నిరభ్యరంతంగా వ్యాక్సిన్లు తీసుకోవచ్చన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), భారత ప్రభుత్వం ఆమోదించిన ఏ టీకానైనా తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రెగ్నెంట్‌గా ఏ దశలో ఉన్నప్పుడైనా టీకా వేసుకోవచ్చన్నారు. మొదటి త్రైమాసికంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారని.. అలా ఉన్నవారు టీకా తీసుకుంటే వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్‌తో మరింత ఇబ్బందులు పడతారని తెలిపారు. ఆ దశలో అనారోగ్య సమస్యలుంటే వ్యాక్సిన్‌ వేసుకోకపోవడమే మంచిదన్నారు. టీకా తీసుకున్నాక వచ్చే దుష్ప్రభావాలు ప్రమాదకరం కాదని స్పష్టం చేశారు. ఆ సైడ్‌ఎఫెక్టులు అందరితోపాటు గర్భిణులకు కూడా ఒకేలా ఉంటాయని తెలిపారు. ఈ ప్రభావాలు మరీ తీవ్రంగా ఉంటే వారు గైనకాలజిస్ట్‌ను కలవాలన్నారు.

పాలిచ్చే తల్లి కూడా టీకా తీసుకోవచ్చని డాక్టర్‌ విద్య స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ వల్ల తల్లికి కానీ పాలు తాగే బిడ్డకు కానీ ఎలాంటి హానీ జరగదని వెల్లడించారు. డెలివరీ జరిగిన అనంతరం కోలుకున్న వెంటనే టీకా తీసుకున్నా ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఐవీఎఫ్‌ ప్రక్రియలో ఉన్న మహిళ సైతం నిర్భయంగా టీకా తీసుకోవచ్చన్నారు. ఐవీఎఫ్‌ విధానాన్ని వ్యాక్సిన్‌ ప్రభావితం చేయదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని