ఓ నౌక..7 బిలియన్‌ డాలర్లు..!

పర్షియన్‌ గల్ఫ్‌లో వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ తొలి వర్థంతి నేపథ్యంలో రాజుకున్న నిప్పు దక్షిణ కొరియాకు చెందిన హంకుక్‌ కెమీ అనే చమురు నౌకను ఇరాన్‌ నిర్బంధడంతో మరింత ఊపందుకుంది........

Updated : 09 Jan 2021 10:11 IST

దక్షిణ కొరియా నౌక నిర్బంధం వెనుక అసలు కారణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్షియన్‌ గల్ఫ్‌లో వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ తొలి వర్థంతి నేపథ్యంలో రాజుకున్న నిప్పు దక్షిణ కొరియాకు చెందిన హంకుక్‌ కెమీ అనే చమురు నౌకను ఇరాన్‌ నిర్బంధడంతో మరింత రగిలింది. ‘ఇరానియన్‌ రెవల్యూషనరీ గార్డ్(ఐఆర్‌జీ)’ బృందాలు ఒక్కసారిగా నౌకలోకి ప్రవేశించి దారి మళ్లించాయని నౌక యజమాని ఆరోపించారు. సులేమానీ వర్థంతి, ఇరాన్‌ అణు శుద్ధి కార్యక్రమం వేగవంతం వంటి పరిణామాల నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకోవడం అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించింది.

నీటిని కాలుష్యం చేసినందుకే..

ద.కొరియా నౌకను నిర్బంధించడం కేవలం సాంకేతికపరమైన అంశమేనని ఇరాన్‌ చెబుతోంది. హర్మూజ్‌ జలసంధి వద్ద జల కాలుష్యానికి పాల్పడడం వల్లే నౌకను అడ్డుకున్నామని తెలిపింది. ఈ చర్యల వెనుక ఇతర కారణాలు, కక్ష్య సాధింపులేమీ లేవని వివరించింది.

వెంటనే విడుదల చేయండి..

ఇరాన్‌ చర్యను దక్షిణ కొరియా తీవ్రంగా ఖండించింది. నౌకను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. దీనిపై చర్చించేందుకు వీలైనంత త్వరలో ఇరాన్‌కు ఓ బృందాన్ని పంపుతామని తెలిపింది. మరోపక్క ద.కొరియా నౌకాదళం ఇప్పటికే 5000 టన్నుల డెస్ట్రాయర్‌లో యాంటీ-పైరసీ ప్రత్యేక దళాల్ని హర్మూజ్‌ జలసంధికి పంపినట్లు వెల్లడించింది.

ఆ 7 బిలియన్‌ డాలర్లే అసలు సమస్యా?

చమురు శుద్ధికి దక్షిణ కొరియా కేంద్రంగా ఉంది. ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇది ఐదో స్థానంలో ఉంది. దక్షిణ కొరియా చమురు దిగుమతుల్లో దాదాపు 15 శాతం ఇరాన్‌ నుంచి వెళతాయి. కానీ, ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ఆ దేశంతో డాలర్లలో లావాదేవీలు జరపొద్దని దక్షిణ కొరియాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ రకంగా ఇరాన్‌ ఆదాయాన్ని దెబ్బకొట్టాలని చూసింది. దీంతో కొరియా కరెన్సీ అయిన వాన్‌లో లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఇరాన్‌ ప్రత్యేక ఖాతాలను తెరిచింది. 2019లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో అమెరికా ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. దీంతో దాదాపు ఏడు బిలియన్‌ డాలర్ల ఇరాన్‌ సొమ్ము ఉన్న వూరీ బ్యాంక్‌, ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కొరియా(ఐబీకే) ఖాతాల్ని నిలిపివేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ల కొనుగోలుకు 180 మిలియన్‌ యూరోలు విడుదల చేయాలని దక్షిణ కొరియాను కోరినట్లు ఇరాన్‌ తెలిపింది. కానీ, వారు అందుకు నిరాకరిస్తున్నట్లు ఆరోపించింది. దీనిపై స్పందించిన ఐబీకే ప్రతినిధి.. మానవతా దృక్పథంతో నిధుల బదిలీకి తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. కానీ, అందుకు అమెరికా ఆర్థికశాఖ నుంచి అనుమతి కావాలని వెల్లడించారు. దీనిపై ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో చర్చల్లో పైచేయి సాధించడం కోసమే తాజాగా ఇరాన్‌ తమ నౌకని నిర్బంధించి ఉంటుందని దక్షిణ కొరియాకు చెందిన పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌ మాత్రం వీటిని తోసిపుచ్చింది. జల కాలుష్యానికి పాల్పడినందుకే నౌకని తాము అదుపులోకి తీసుకున్నామని తెలిపింది.

ఇవీ చదవండి..

ట్రంప్‌ మరో కీలక నిర్ణయం!

చైనా తీరుపై WHO అసహనం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని