Iran: ‘ఐదో ముప్పు’తో ఆంక్షల్లోకి ఇరాన్‌! 

ఏడాదికాలంగా కరోనా వైరస్‌కు వణికిపోతోన్న ఇరాన్‌లో ఐదు ముప్పు (Fifth Wave) పొంచివుందన్న నివేదికల నేపథ్యంలో ఈ చర్యలు తప్పవని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

Published : 04 Jul 2021 22:09 IST

డెల్టా వేరియంట్‌ భయంతో మరోసారి ఆంక్షలు

తెహ్రాన్‌: కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌తో ప్రపంచ దేశాలు మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోనూ ఈ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఇరాన్‌, దాదాపు అన్ని నగరాల్లో మరోసారి ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఏడాది కాలంగా కరోనా వైరస్‌కు వణికిపోతోన్న ఇరాన్‌లో ఐదో ముప్పు (Fifth Wave) పొంచి ఉందన్న నివేదికల నేపథ్యంలో ఈ చర్యలు తప్పవని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

డెల్టా రకంతో ఐదో ముప్పు..?

గడిచిన ఏడాది కాలంలో నాలుగు సార్లు కరోనా వైరస్‌ విజృంభించడంతో ఇరాన్‌ వణికిపోయింది. ఇప్పటివరకూ అక్కడ 32లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడగా దాదాపు 85వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ మధ్య కాలంలో వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గినట్లు కనిపించడంతో కొవిడ్‌ ఆంక్షలను సడలించారు. ఇదే సమయంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న డెల్టా వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. గడిచిన రెండు వారాల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరగడం కనిపించింది. దీంతో దేశంలో ‘ఐదో ముప్పు (Fifth Wave)’కు డెల్టా వేరియంట్‌ కారణమయ్యే ప్రమాదముందని ఇరాన్‌ అధ్యక్షుడు హస్సాన్‌ రౌహాని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు వారాల నుంచి పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే అలాగే కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి మరోసారి ఆంక్షలు విధించడం తప్పనిసరి అని స్పష్టంచేశారు.

275 పట్టణాల్లో ఆంక్షలు..

పక్షం రోజుల్లోనే రోజువారి కేసులు రెట్టింపు కావడంతో అప్రమత్తమైన ఇరాన్‌ ప్రభుత్వం, వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న నగరాల మధ్య ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. దాదాపు 275 పట్టణాల్లో అత్యవసరం కాని వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని ఆదేశించింది. మాల్స్‌, పార్కులు, రెస్టారెంట్లు, సెలూన్లు, బుక్‌స్టోర్లను రెడ్‌ జోన్లుగా ప్రకటించింది. ఐదో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఇలాంటి చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

2శాతం మందికే వ్యాక్సిన్‌..

ఓ వైపు వైరస్‌ తీవ్రత పెరుగుతున్న సమయంలోనే.. ఇరాన్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగానే సాగుతోంది. ఇప్పటివరకూ అక్కడ 63లక్షల డోసులను అందించినట్లు ఇరాన్‌ ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 8.4కోట్ల జనాభా కలిగిన ఇరాన్‌లో కేవలం 2శాతం కంటే తక్కువ మందికి మాత్రమే రెండు డోసులను అందించారు. వ్యాక్సిన్‌ల కోసం ఇరాన్‌ ‘కొవాక్స్‌’ కార్యక్రమంపై ఆధారపడంతో పాటు చైనాకు చెందిన సినోఫార్మ్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌లను దిగుమతి చేసుకుంటోంది. అయితే, అమెరికా, బ్రిటన్‌ నుంచి వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడాన్ని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమైనీ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ (COVIran Barakat)కు అక్కడి ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. దీంతో దేశీయ వ్యాక్సిన్‌పై అక్కడి ప్రజలకు విశ్వాసం కలిగించడంలో భాగంగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మీడియా సమక్షంలోనే వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని