CoronaVirus: భారత్‌పై ఇరాన్‌ ఆంక్షలు

భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షల బాట పట్టాయి. ఇప్పటికే భారత్‌ను బ్రిటన్‌ రెడ్‌లిస్ట్‌లో చేర్చగా.. కెనడా విమానాల రాకపోకలపై

Published : 24 Apr 2021 22:20 IST

టెహ్రాన్‌: భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షల బాట పట్టాయి. ఇప్పటికే భారత్‌ను బ్రిటన్‌ రెడ్‌లిస్ట్‌లో చేర్చగా.. కెనడా విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. తాజాగా ఇరాన్‌ కూడా ఈ జాబితాలో చేరింది. భారత్‌ నుంచి ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించేది లేదని శనివారం వెల్లడించింది. 

భారత్‌, పాకిస్థాన్‌ నుంచి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ స్థానిక మీడియాకు ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు హసన్‌ రౌహనీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత కరోనా రకం మనం ఎదుర్కొంటున్న కొత్త ముప్పు. బ్రిటన్, బ్రెజిల్‌లో వెలుగుచూసిన దానికంటే ఇది మరింత ప్రమాదకరంగా ఉంది’’ అని అన్నారు. అయితే భారత కరోనా రకం కేసులు ఇరాన్‌లో నమోదయ్యాయా? లేదా అన్న విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించలేదు.

కరోనా వైరస్‌కు ఇరాన్‌ కూడా విలవిల్లాడుతోంది. అక్కడ మొత్తం పాజిటివ్‌ కేసులు 20లక్షలు దాటాయి. సగటున రోజుకు 20వేల కేసులు నమోదవుతుండగా.. ఇప్పటివరకు దాదాపు 70వేల మంది మహమ్మారికి బలయ్యారు. అక్కడ వైరస్‌ నాలుగో దశ విజృంభణ కొనసాగుతుండటంతో చాలా ప్రాంతాలు గత రెండు వారాలుగా లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఇక ఇరాన్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని