ప్రభుత్వానికే నోటీసులు పంపిన డైరెక్టర్‌

అక్రమాలకు పాల్పడిన వారికి ప్రభుత్వాలు నోటీసులు ఇస్తుంటాయి. అయితే,  ప్రభుత్వమే అక్రమానికి పాల్పడిందంటూ ఓ డాక్యుమెంటరీ డైరెక్టర్‌ ప్రభుత్వానికే నోటీసులు పంపి వార్తలో నిలిచింది. ఇండోనేషియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 06 Oct 2020 11:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్రమాలకు పాల్పడిన వారికి ప్రభుత్వాలు నోటీసులిస్తుంటాయి. అయితే, ప్రభుత్వమే అక్రమానికి పాల్పడిందంటూ ఓ డాక్యుమెంటరీ డైరెక్టర్‌ నోటీసులు పంపిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది.

ఇండోనేషియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. ఉచూ ఆగస్టిన్‌ ఇండోనేషియాకి చెందిన డాక్యుమెంటరీ డైరెక్టర్‌. అంధులైన ఇద్దరు స్నేహితుల జీవితం ఆధారంగా ఆమె ఓ డాక్యుమెంటరీ తీశారు. అయితే గత జూన్‌ నెలలో పిల్లలకు చదువు ఆవశ్యకతను తెలిపేందుకు ప్రభుత్వానికి చెందిన టీవీఆర్‌ఐ అనే ఛానెల్‌లో ‘ఇంటి వద్దే చదువు’ అనే కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఇందులో భాగంగా ఆగస్టిన్‌ తీసిన డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. ఇండోనేషియాలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పాఠశాలలు తెరిచే వీలు లేక.. విద్యార్థులను ఇంటి వద్దే చదువుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకురాలి అనుమతి లేకుండా ఆమె డాక్యుమెంటరీని విద్యాశాఖ సూచనల మేరకు టీవీఆర్‌ఐ ఛానెల్‌ ప్రసారం చేసింది. దీంతో మరో రెండు టీవీ ఛానెళ్లు కూడా ఆ డాక్యుమెంటరీని ఆగస్టిన్‌ను అడగకుండానే ప్రసారం చేశాయి. 

దీంతో అనుమతి లేకుండా తన డాక్యుమెంటరీని ప్రసారం చేసిన టీవీఆర్‌ఐకు, విద్యాశాఖకు, రెండు టీవీ ఛానెళ్లకు ఉచూ ఆగస్టిన్‌ ఇటీవల నోటీసులు పంపించింది. నిజానికి డాక్యుమెంటరీ 34 నిమిషాల 26 సెకన్లు ఉంటే.. దానిని ఎడిట్‌ చేసి 22 నిమిషాల 58 సెకన్లకు కుదించారట. దీనిపై ఆగస్టిన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా డాక్యుమెంటరీని ఎడిట్‌ చేయడం వల్ల దాని సారాంశం దెబ్బతిన్నదని ఆరోపించారు. డాక్యుమెంటరీని తర్జుమా చేయడంలోనూ అనేక పొరపాట్లు జరిగాయని మండిపడ్డారు. విద్యాశాఖ సహా టీవీ ఛానెళ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. దీంతోపాటు పలు డిమాండ్లను వెల్లడించారు. ఈ అంశంపై విద్యాశాఖ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని