Corona: భారత్‌లో కొత్త రకం..బ్రిటన్‌కు ఆటంకం!

భారత్‌లో విస్తరిస్తోన్న కరోనా కొత్త రకం.. బ్రిటన్‌కు ఇబ్బందిగా మారింది. ఆ దేశాన్ని ఆంక్షల ఛట్రం నుంచి వెలుపలికి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అంతరాయం కలిగిస్తోంది. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Updated : 15 May 2021 12:25 IST

లండన్‌: భారత్‌లో విస్తరిస్తోన్న కరోనా కొత్త రకం.. బ్రిటన్‌కు ఇబ్బందిగా మారింది. ఆ దేశాన్ని ఆంక్షల ఛట్రం నుంచి వెలుపలికి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అంతరాయం కలిగిస్తోంది. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

‘మా ప్రణాళికను వాయిదా వేసుకోవాల్సి వస్తుందని నేను అనుకోవట్లేదు. అయితే ఈ కొత్త కరోనా రకం మా పున:ప్రారంభ ప్రణాళికకు అంతరాయం కలిగించొచ్చు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు మేము ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని బోరిస్ జాన్సన్ అన్నారు. B1.617.2 కరోనా రకం వాయువ్య ఇంగ్లండ్‌లో వేగంగా వ్యాపిస్తోందని, కొద్దిమేర లండన్‌లో కూడా దాని ప్రభావం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాప్తిని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. గత వారం 520గా ఉన్న ఈ తరహా కేసులు ఈ వారం 1,313కి చేరాయి. దాంతో పరీక్షల సంఖ్యను పెంచడంతోపాటు, స్థానికంగా ఆంక్షలు కూడా విధిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.

అలాగే 50ఏళ్లు పైడినవారికి రెండో డోసు టీకాను అందించే ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు జాన్సన్ తెలిపారు. ఈ కొత్త రకం వేగంగా వ్యాప్తి చెందుతుందా అనే అంశంపై తాము నిపుణుల నుంచి వచ్చే సమాచారం కోసం వేచిచూస్తున్నామన్నారు. దాన్ని బట్టే తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. ఈ ఉత్పరివర్తన రకం భారత్‌లో మొదట వెలుగుచూసింది.   

బ్రిటన్‌లో జరుగుతోన్న టీకా కార్యక్రమం కరోనాను కట్టడి చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ కొత్త రకంపై కూడా టీకాలు ప్రభావంతంగా ఉంటాయని అక్కడి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘టీకాల ప్రభావం తక్కువగా ఉందనే ఆధారాలు ఇంతవరకు లభించలేదు. గతంలో పోలిస్తే మేం భిన్నమైన స్థితిలో ఉన్నాం’ అని జాన్సన్ తెలిపారు. ఇదిలా ఉండగా.. భారత్‌లో నెలకొని ఉన్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై గతనెల బ్రిటన్ కఠిన ఆంక్షలను విధించింది. ప్రయాణాల విషయంలో మనదేశాన్ని రెడ్‌ లిస్ట్‌లో చేర్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని