Covaxin: కొవాగ్జిన్‌కు యూకే గుర్తింపు.. నవంబర్‌ 22 నుంచి అనుమతి

అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా మరిన్ని నిర్ణయాలు వెలువరించింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం గుర్తించిన కొవిడ్‌ టీకాల జాబితాలో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చనున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 22 నుంచి ఈ టీకా తీసుకున్నవారు...

Published : 09 Nov 2021 14:36 IST

లండన్‌: అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా మరిన్ని నిర్ణయాలు వెలువరించింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ‘గుర్తించిన కొవిడ్‌ టీకాల జాబితా’లో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చుతున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 22 నుంచి ఈ టీకా తీసుకున్నవారు బ్రిటన్‌కు చేరుకున్న తర్వాత ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ను ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. యూకే ప్రభుత్వం ఇదివరకే కొవిషీల్డ్‌ను గుర్తించింది.

‘ఐసొలేషన్‌ అవసరం లేదు..’

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ బ్రిటిష్‌ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్‌ సైతం ట్వీట్‌ చేశారు. ‘బ్రిటన్‌కు వచ్చే భారత ప్రయాణికులకు మరో శుభవార్త. నవంబరు 22 నుంచి కొవాగ్జిన్‌తోసహా డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగానికి గుర్తించిన టీకాలు వేసుకొని ఇక్కడికి చేరుకున్నాక ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 22 తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రభుత్వం.. కొవాగ్జిన్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్‌లనూ గుర్తించింది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ పూర్తయిన ప్రయాణికులు బయలుదేరడానికి ముందు, వచ్చాక ఎనిమిది రోజులకు పరీక్ష చేయించుకోవడం, ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని