Internet Users: 2025 నాటికి 90 కోట్ల యూజర్లు!

2025 నాటికి దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 90కోట్లకు పెరగనున్నట్లు IAMAI నివేదిక అంచనా వేసింది.

Published : 03 Jun 2021 21:48 IST

రోజులో 107 నిమిషాలు అంతర్జాలంలోనే - IAMAI నివేదిక

ముంబయి: గత కొన్నేళ్లుగా దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 90కోట్లకు పెరగనున్నట్లు తాజా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత వినియోగంతో పోలిస్తే దాదాపు 45శాతం పెరుగుదల నమోదు చేసుకోనున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్‌ వినియోగంలో మహారాష్ట్ర ముందుండగా.. అక్కడి జనాభాలో 61శాతం ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు పేర్కొంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ వినియోగం భారీగా పెరుగుతున్నట్లు ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (IAMAI), కంటార్‌ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగంపై IAMAI, Kantar సంయుక్తంగా చేపట్టిన ICUBE 2020 రిపోర్టును తాజాగా విడుదల చేసింది. దేశ జనాభాలో 43శాతం మంది (నగర, గ్రామీణ ప్రాంతాలు కలిపి) నెలలో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం 62.2 కోట్లుగా ఉన్న యూజర్ల సంఖ్య 2025 నాటికి 90కోట్లకు చేరుకుంటుందని అంచనా. వచ్చే ఐదేళ్లలోనే దాదాపు 45శాతం పెరుగుదల కనిపించనుంది. ప్రస్తుతం నగరాల్లో 32.3 కోట్ల యూజర్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 29.9 కోట్ల యూజర్లు ఉన్నారు. అయితే, గతేడాది నగర ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. నగరాల్లో 4శాతం పెరగగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ పెరుగుదల 13శాతం కనిపించినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న వారిలో 58శాతం పురుషులు కాగా.. 42శాతం మహిళలు వినియోగిస్తున్నారని IAMAI నివేదిక పేర్కొంది.

మహారాష్ట్ర టాప్‌.. చివరలో బిహార్‌..

రాష్ట్రాల వారీగా చూస్తే.. ఇంటర్నెట్‌ వినియోగంలో మహారాష్ట్ర ముందుంది. అక్కడ జనాభాలో దాదాపు 61శాతం మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. 60శాతం యూజర్లతో గోవా రెండో స్థానంలో ఉండగా,  59శాతం మంది ఇంటర్నెట్‌ యూజర్లతో కేరళ మూడో స్థానంలో ఉంది. ఇక ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో 29శాతం, బిహార్‌లో 24శాతం మంది ప్రజలు మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. ఇక నగరాల విషయానికొస్తే.. ఇంటర్నెట్‌ వినియోగంలో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రోజుకు 107 నిమిషాలు..

మొబైల్‌ ఫోన్ల వాడకం పెరగడమే దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం ఎక్కువ కావడానికి దోహదం చేసినట్లు IAMAI నివేదిక మరోసారి స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌ క్రియాశీల యూజర్లు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లు  వినియోగిస్తుండగా.. కేవలం 17శాతం మంది మాత్రమే వ్యక్తిగత కంప్యూటర్లలో వాడుతున్నారు. మరో 6శాతం మంది మాత్రమే టాబ్లెట్లు, స్మార్ట్‌ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. ఇలా ఇంటర్నెట్‌లో క్రియాశీలంగా ఉండే వ్యక్తి రోజుకు సరాసరి 107నిమిషాలు అంతర్జాలంలోనే గడుపుతున్నారు. ముఖ్యంగా ఎంటర్‌టెయిన్‌మెంట్‌, ఇతరులతో మాట్లాడడం, సామాజిక మాధ్యమాల కోసం ఇంటర్నెట్‌ విరివిగా వాడుతున్నట్లు IAMAI నివేదిక తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని