NCRB: దేశంలో ప్రతిరోజు 31 మంది చిన్నారుల ఆత్మహత్య!

దేశవ్యాప్తంగా 2020లో రోజుకు సగటున 31 మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంక సంస్థ (NCRB) వెల్లడించింది......

Published : 01 Nov 2021 01:07 IST

దిల్లీ: దేశంలో వివిధ కారణాలతో అభం శుభం తెలియని చిన్నారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 18 ఏళ్లు నిండకుండానే అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే లెక్కలు కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 2020లో రోజుకు సగటున 31 మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంక సంస్థ (NCRB) వెల్లడించింది. ఈ బలవన్మరణాలకు కరోనా, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, అనారోగ్యం కారణమని స్పష్టంచేసింది.

2020లో దేశవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 31 మంది పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారని, మొత్తంగా 11,396 మంది చిన్నారులు ఆత్మహలు చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2019లో 9,613 మంది, 2018లో 9,413 మంది చిన్నారులు ఇలా ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. గతేడాది చిన్నారుల ఆత్మహత్యలు పెరగడానికి కరోనా మహమ్మారి ఓ కారణమని.. వైరస్‌ కారణంగా వారు మానసిక సమస్యలు ఎదుర్కొని తనువు చాలించి ఉండవచ్చని నివేదిక వెల్లడించింది. 18 ఏళ్ల వయసులోపు వారిలో కుటుంబ సమస్యల కారణంగా 4006 మంది, ప్రేమ వ్యవహారాలతో 1337 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. హీరోల పట్ల ఆరాధన, ఉపాధి లేకపోవడం, దివాలా, నపుంసకత్వం, మాదకద్రవ్యాల వినియోగం లాంటివి కూడా 18 వయసులోపు ఉన్నవారి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా వెల్లడించింది.

ఆన్‌లైన్‌ బెదిరింపులు, సైబర్‌ నేరాలకు బాధితులు

పెరుగుతున్న పిల్లల ఆత్మహత్యల సంఖ్య వ్యవస్థాగత వైఫల్యానికి ప్రతిబింబిస్తోందని, ఇది తల్లిదండ్రులు, ప్రభుత్వ సమష్టి బాధ్యత అని నిపుణులు గుర్తుచేశారు. కరోనా వైరస్‌ ఫలితంగా పాఠశాలల మూసివేత, ఒంటరితనం, పెద్దల ఆందోళనలు, పిల్లల సమస్యలను మరింత తీవ్రం చేశాయని తెలిపారు. గృహ నిర్బంధం, స్నేహితులు, ఉపాధ్యాయులు, ఇతరులతో పరస్పర చర్య లేకపోవడం వల్ల కూడా పిల్లల్లో విపరీతమైన మానసిక ఒత్తిడి పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. చిన్నారులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు కష్టపడ్డారని.. మరికొంతమంది సామాజిక మాధ్యమాలకు ఎక్కువగా ప్రభావితమయ్యారని తెలిపారు. ఇంకొంతమంది ఆన్‌లైన్‌ బెదిరింపులు, సైబర్‌ నేరాలకు గురయ్యారని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని