Global Youth Development Index: యువత అభివృద్ధి సూచిలో సింగపూర్‌ నంబర్‌ వన్‌.. మరి భారత్‌?

ప్రపంచ యువత అభివృద్ధి సూచి(గ్లోబల్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌)లో భారత్‌ 122వ స్థానంలో నిలిచింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, సమానత్వం, శాంతి, భద్రత, రాజకీయ, పౌర కార్యకలాపాలు తదితర 27 అంశాల్లో యువత పాత్ర, అభివృద్ధిపై 181 దేశాల్లో సర్వే నిర్వహించిన ‘ది కామన్‌వెల్త్‌’ సంస్థ

Published : 11 Aug 2021 00:16 IST

ర్యాంకింగ్స్‌ విడుదల చేసిన ‘ది కామన్‌వెల్త్‌’ సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ యువత అభివృద్ధి సూచి(గ్లోబల్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌)లో భారత్‌ 122వ స్థానంలో నిలిచింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, సమానత్వం, శాంతి, భద్రత, రాజకీయ, పౌర కార్యకలాపాలు తదితర 27 అంశాల్లో యువత పాత్ర, అభివృద్ధిపై 181 దేశాల్లో సర్వే నిర్వహించిన ‘ది కామన్‌వెల్త్‌’ సంస్థ తాజాగా ఈ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. సింగపూర్‌ మొదటి స్థానంలో నిలవగా.. స్లోవేనియా, నార్వే, మాల్టా, డెన్మార్క్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చాద్‌, ది సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, దక్షిణ సుడాన్‌, అఫ్గానిస్థాన్‌ జాబితాలో అడుగున ఉన్నాయి. 

3.1 శాతం మెరుగుదల
2010 నుంచి 2018 వరకు ప్రపంచవ్యాప్తంగా 15- 29 ఏళ్ల మధ్యవారిపై అధ్యయనం చేసి, నివేదిక విడుదల చేసిందీ ఈ సంస్థ. ఈ వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా యువత పరిస్థితులు 3.1 శాతం మెరుగుపడ్డాయని వెల్లడించింది. కానీ పురోగతి నెమ్మదిగా ఉన్నట్లు తెలిపింది. కొవిడ్‌ వ్యాప్తికి ముందు సేకరించిన వివరాలు అయినా.. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు సాధించిన ప్రగతి కూడా నీరుగారే అవకాశం ఉందని, వెంటనే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. ర్యాంకింగ్స్‌ విడుదలకు ముందు ‘ది కామన్‌వెల్త్‌’ ప్రధాన కార్యదర్శి పాట్రిసియా స్కాట్లాండ్‌ మాట్లాడుతూ.. ఉజ్వల భవిష్యత్తు అందించడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.

రాజకీయాలపై నిరాసక్తత..
ఆయా అంశాలవారీగా చూసుకుంటే.. విద్యలో స్వీడన్‌, సమానత్వంలో లక్జెంబర్గ్‌, రాజకీయ, పౌర చైతన్యంలో ఇండోనేషియా, ఉపాధి, ఆరోగ్యం, శాంతి, భద్రత అంశాల్లో సింగపూర్‌ ముందంజలో ఉన్నాయి. గత ఫలితాలతో పోల్చితే అఫ్గానిస్థాన్‌, భారత్‌, రష్యా, ఇథియోపియా, బుర్కినా ఫాసో దేశాలు మెరుగుదల కనబర్చిన మొదటి ఐదు దేశాల్లో నిలిచాయి. యువతలో మరణాల రేటు, హెచ్‌ఐవీ కేసుల సంఖ్య, మద్యపానం, పొగాకు బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కానీ.. మహిళల భద్రత విషయంలో పురోగతి కనిపించలేదని నివేదికలో వెల్లడైంది. 102 దేశాల్లోని యువత.. రాజకీయాలపై తక్కువ ఆసక్తి కనబర్చుతున్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని