Trump: కరోనాతో భారత్‌ సర్వనాశనమైంది

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి ఈ అంశంపై మాట్లాడారు

Published : 18 Jun 2021 16:12 IST

అమెరికాకు చైనా 10 ట్రిలియన్‌ డాలర్లు చెల్లించాలన్న ట్రంప్‌

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి ఈ అంశంపై మాట్లాడారు. కరోనాతో భారత్‌ సర్వనాశనమైందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌తో తీవ్రంగా నష్టపోయిన అమెరికాకు చైనా 10 ట్రిలియన్‌ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. వాస్తవానికి చైనా ప్రపంచానికి ఇంకా ఎక్కువగానే రుణ పడివుందనీ, కానీ వారికి ఇంతకంటే మించి చెల్లించే సామర్థ్యం లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు.

ప్రముఖ మీడియా సంస్థ ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పలు విషయాలు మాట్లాడారు. ‘చైనా చేసిన పనికి అనేక దేశాలు కకావికలమయ్యాయి. చైనా ఇది కావాలని చేసినా లేదా ప్రమాదవశాత్తు జరిగినా తీవ్ర నష్టమైతే వాటిల్లింది. ఇది వారి అసమర్థత కారణంగా జరిగినట్లు భావిస్తున్నా. అదెలా జరిగినా అనేక దేశాలు దీని నుంచి కోలుకోలేనంతగా నష్టపోయాయి. ఆ దేశాలు మళ్లీ మునుపటిలా ఉండకపోవచ్చు. అమెరికాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. కానీ మరికొన్ని దేశాలపై మరింత అధిక ప్రభావం చూపించింది’ అని వ్యాఖ్యానించారు. 

వైద్య సదుపాయాలు కరవై భారత్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘భారత్‌లో ఏం జరుగుతోందో చూడండి. కొవిడ్‌తో ఆ దేశం సర్వనాశనమైంది. ఒక్క భారత్‌ మాత్రమే కాదు అన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇందుకు చైనా సహకారం అందించాలి’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి వేగంగా పుంజుకుంటున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని