మాస్క్‌ ధరించలేదో.. రెజ్లర్లు ‘పట్టు’పడతారు

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాపై పోరాడేందుకు రెజ్లర్లు రంగంలోకి దిగారు. ఎవరైనా మాస్కు పెట్టుకోకుండా కనిపిస్తే వారిని దొరకబుచ్చుకొని మరీ మాస్కులు తొడుగుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు....

Updated : 15 Mar 2021 12:46 IST

లూచా లిబ్రే రెజ్లర్ల వినూత్న ప్రయత్నం

మెక్సికో: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాపై పోరాడేందుకు రెజ్లర్లు రంగంలోకి దిగారు. ఎవరైనా మాస్కు పెట్టుకోకుండా కనిపిస్తే వారిని దొరకబుచ్చుకొని మరీ మాస్కులు తొడుగుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దాని ధాటికి అనేక రంగాలు కుదేలైపోయాయి. ఎంతోమందికి ఉపాధి కరవైంది. దక్షిణ అమెరికాలోని మెక్సికోలో విశేష ప్రాచుర్యం పొందిన లూచా లిబ్రే రెజ్లింగ్‌ కూడా కొవిడ్‌ దెబ్బకు కుదేలైంది. కరోనాకు ముందు రెజ్లింగ్‌కు వేలమంది హాజరయ్యేవారు. కొవిడ్‌ కారణంగా రెజ్లింగ్‌ కార్యక్రమాలను నిలిపివేయడంతో రెజ్లర్లు ఉపాధి కోల్పోయారు.

మహమ్మారి అంతరించిపోతేనే తిరిగి తమకు ఉపాధి దొరుకుతుందని భావించిన రెజ్లర్లు కరోనాపై పోరుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజు దాదాపు ఐదు లక్షల మంది వచ్చే అత్యంత ప్రసిద్ధి గాంచిన ‘డి అబాస్టో’ మార్కెట్‌కు ఎవరైనా మాస్కు ధరించకుండా వస్తే వారిని దొరకబుచ్చుకొని మరీ మాస్కు తొడుగుతున్నారు. రెజ్లింగ్‌ రింగ్‌లోకి దిగే దుస్తులు ధరించి, మాస్కులు పెట్టుకొని.. మాస్కు లేకుండా మార్కెట్‌కు వచ్చే కొనుగోలుదారులు, మార్కెట్లో ఉన్న అమ్మకందారులను మాస్కు ధరించాలని సూచిస్తున్నారు. సమాజం పట్ల బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు.

మెక్సికోలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే అక్కడ 2 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంటినుంచి బయటకు వచ్చేవారు మాస్కులు ధరించకుండా వస్తున్నారని, వారంతా మార్కెట్లలో గుమిగూడి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని రెజ్లర్లు ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని