3rd Wave: థర్డ్‌ వేవ్‌ వచ్చినా.. ప్రభావం తక్కువే: సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌

కరోనా థర్డ్ వేవ్‌ వచ్చినా.. రెండో దశతో పోలిస్తే తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డా.శేఖర్‌ సి మండే పేర్కొన్నారు

Published : 24 Sep 2021 22:17 IST

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో థర్డ్‌ వేవ్‌ కూడా రానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మూడో దశ వచ్చినా.. దాని ప్రభావం పెద్దగా ఉండబోదని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) వెల్లడించింది. దాని తీవ్రగా తక్కువగానే ఉండనున్నట్లు పేర్కొంది. సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శేఖర్‌ సి మండే శుక్రవారం మాట్లాడుతూ.. ‘దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భారీ సంఖ్యలో జనాభా మొదటి, రెండో డోసులు వేసుకున్నారు. వైరస్‌ను చాలా వరకు నివారించే శక్తి మన టీకాలకు ఉంది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినా.. దాని తీవ్రత పెద్దగా ఉండదు. ఒకవేళ మూడో దశ వచ్చినా.. రెండో దశతో పోలిస్తే తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది’ అని డాక్టర్‌ శేఖర్‌ సి మండే పేర్కొన్నారు.

వివిధ దేశాల్లో కరోనా ప్రభావాన్ని బట్టి చూస్తే మన దగ్గరా మూడో దశ (థర్డ్‌ వేవ్‌) ఉండే అవకాశం ఉందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి గతంలో వెల్లడించారు. వైరస్‌లో తీవ్రమైన ఉత్పరివర్తనాలు జరిగితే తప్ప భారత్‌లో దాని ప్రభావం తక్కువేనని తెలిపారు. థర్డ్‌వేవ్‌ పిల్లలపై తీవ్రత చూపుతుందనే దానిపై సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు.

దేశంలోని పలువురు నిపుణులు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. కాన్పుర్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తేనే మరో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బయోటెక్నాలజీ విభాగం సెక్రెటరీ డాక్టర్‌ రేణు స్వరూప్‌ మాట్లాడుతూ మూడో వేవ్‌ వచ్చేలా ప్రజలు ప్రవర్తిస్తేనే అది వచ్చే అవకాశం ఉందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని