UNICEF: ఆ చిన్నారులు ఎంత భయపడి ఉంటారో ఊహించగలను

తాలిబన్ల ఆక్రమణ కారణంగా ఇటీవల అఫ్గానిస్థాన్‌లో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. గతంలో వారి పాలనతో ఉన్న చేదు అనుభవాల దృష్ట్యా వేలాది మంది అఫ్గానీయులు దేశం విడిచివెళ్లేందుకు పిల్లాపాపలతో కలిసి కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు...

Published : 07 Sep 2021 21:48 IST

తమవారికి దూరమైన అఫ్గాన్‌ పిల్లల సంరక్షణ అత్యవసరం: యునిసెఫ్‌ చీఫ్‌

జెనీవా: తాలిబన్ల ఆక్రమణ కారణంగా ఇటీవల అఫ్గానిస్థాన్‌లో సంక్షోభ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. గతంలో వారి పాలనతో ఉన్న చేదు అనుభవాల దృష్ట్యా వేలాది మంది అఫ్గానీయులు దేశం విడిచివెళ్లేందుకు పిల్లాపాపలతో కలిసి కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. దీంతో ఏయిర్‌పోర్టులో, పరిసరాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తొక్కిసలాటలు, బాంబు పేలుళ్లు, కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ భీతావహ పరిస్థితుల నడుమ అనేకమంది పిల్లలు తమ కుటుంబాల నుంచి దూరమైనట్లు ఐరాస మంగళవారం వెల్లడించింది. తరలింపు ప్రక్రియలో భాగంగా వందలాది చిన్నారులు విమానాల్లో జర్మనీ, కతర్‌ తదితర దేశాలకు చేరుకున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు దాదాపు 300 మందిని గుర్తించినట్లు ఐరాస అనుబంధ సంస్థ యునిసెఫ్‌ చెప్పింది. గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నందున వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంస్థ చీఫ్ హెన్రిట్టా ఫోర్ ఒక ప్రకటనలో తెలిపారు.

హింస నుంచి కాపాడాలి..

‘ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి, కుటుంబ సభ్యులు తమతో లేరని తెలుసుకున్నప్పుడు.. విమానాల్లో వేరే ఇతర ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో.. సదరు చిన్నారులు ఎంత భయపడి ఉంటారో నేను ఊహించగలను.  ఇలా తప్పిపోయినవారిని త్వరగా గుర్తించడంతోపాటు వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేవరకు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమ’ని ఫోర్ అన్నారు.  ఈ క్రమంలో వారి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ, హింస నుంచి కాపాడాలని.. పిల్లలకు ఆశ్రయం ఇస్తున్న దేశాలకు విజ్ఞప్తి చేశారు. సురక్షిత సంరక్షణ చర్యల ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. ఈ సంస్థ.. ప్రస్తుతం ఒంటరిగా ఉన్న బాలబాలికలను గుర్తించడం, వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఆశ్రయ దేశాలకు సాంకేతిక సహకారం అందజేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని