Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన వంతెనలు

దేవభూమి ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి.

Updated : 19 Oct 2021 13:19 IST

డెహ్రాడూన్‌: దేవభూమి ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. వరద ఉద్ధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 

నీట మునిగిన నైనిటాల్‌..

భారీ వర్షాలకు నైనిటాల్‌ జిల్లా అతలాకుతలమైంది. వరద ఉద్ధృతికి నైనిటాల్‌ సరస్సు ఉప్పొంగడంతో సమీప గ్రామాలకు వరద పోటెత్తింది. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించారు.

కొట్టుకుపోయిన వంతెనలు..

వరద ఉద్ధృతికి పలు చోట్ల రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. హల్ద్వానీ ప్రాంతంలో గౌలా నది ఉప్పొంగడంతో ఆ నదిపై ఉన్న వంతెన కొంతమేర కొట్టుకుపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై వంతెన మీదకు రావడం గమనించిన స్థానికులు అతడిని హెచ్చరించడంతో వెనుదిరిగాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇక చంపావత్‌ ప్రాంతంలో చల్తీ నదికి వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది.  

చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత..

వర్షాల కారణంగా కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ ఆలయాలకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాతే యాత్రికులను అనుమతిస్తామని తెలిపారు. 

వరద పరిస్థితులపై మోదీ ఆరా..

అటు ఉత్తరాఖండ్‌లో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఈ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి, కేంద్రమంత్రి అజయ్ భట్‌లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని