Vaccination Song: విందామా.. ‘100కోట్ల ఘనత’ గీతం

కరోనా మహమ్మారిని అరికట్టే బృహత్తర వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌ చరిత్ర సృష్టించింది. టీకా డోసుల పంపిణీలో 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించింది.

Updated : 21 Oct 2021 17:21 IST

దిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టే బృహత్తర వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌ చరిత్ర సృష్టించింది. టీకా డోసుల పంపిణీలో 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించింది. ఈ అపురూప ఘట్టానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గీతం విడుదల చేసింది. ఈ ఆడియో విజువల్‌ పాటను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘వ్యాక్సినేషన్‌లో 100కోట్ల మార్క్‌.. దేశ ప్రజల నమ్మకానికి సంకేతం. భారత స్వావలంబన దీపావళి’’ అని ఆయన రాసుకొచ్చారు. 

‘‘మనం ఎక్కడా ఆగము, ఎక్కడా ఆగిపోము.. శత్రువు ఎవరైనా మనం తలవంచం.. విరోధికి వంద ఆయుధాలున్నా.. శతకోటి కవచాలతో మనం ఎదుర్కొంటాం.. నా భారత్‌కు ఆ విశ్వాసం ఉంది. అందరితో కలిసి, అందరి సహకారంతో సాధిస్తాం.. టీకా పంపిణీలో భారత్ నవ చరిత్ర సృష్టించింది’’ అంటూ సాగే ఈ గీతం వ్యాక్సినేషన్‌లో దేశం సాధించిన ప్రగతికి అద్దం పడుతోంది. కరోనాను ఎదుర్కోవడం కోసం టీకా తయారీ దగ్గర్నుంచి.. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడం కోసం వైద్యారోగ్య సిబ్బంది పడిన శ్రమను ఇందులో చూపించారు. 

‘టీకా సే బచా హై దేశ్‌ (దేశాన్ని కాపాడుతున్న టీకాలు)’ పేరుతో రూపొందించిన ఈ గీతాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత  కైలాశ్‌ ఖేర్‌ ఆలపించారు. దిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని విడుదల చేశారు. అంతకుముందు కూడా వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఓ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వ్యాక్సినేషన్‌లో ‘100 కోట్ల ఘనత’పై గీతాన్ని మీరూ వినేయ్యండి..! 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని