Haryana CM: ‘ఆ పదాల వాడకం తప్పు’.. ఉన్నతాధికారి వ్యాఖ్యలపై ఖట్టర్‌

‘రైతుల తలలు పగలగొట్టండి’ అంటూ కర్నల్‌ జిల్లా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ స్పందించారు.

Updated : 24 Sep 2022 16:33 IST

చండీగఢ్‌: కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన హరియాణా రైతులపై లాఠీఛార్జి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ‘రైతుల తలలు పగలగొట్టండి’ అంటూ కర్నల్‌ జిల్లా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. సదరు అధికారిపై చర్యలుంటాయని ఇప్పటికే డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌతాలా ప్రకటించారు. తాజాగా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సైతం స్పందించారు. రైతులపై పోలీసుల లాఠీఛార్జిని మరోసారి సమర్థించుకునేలా మాట్లాడిన ఆయన.. ఉన్నతాధికారి మాత్రం ‘పదజాలం వాడకం తప్పు’ అని చెప్పుకొచ్చారు.

‘‘శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఒక్కోసారి కఠినంగా ఉండాల్సిందే. అయితే, ఇక్కడ (సంఘటనను ఉద్దేశిస్తూ) ‘తలలు పగలగొట్టండి’ వంటి తీవ్రమైన పదజాలం వాడడం తప్పు’’ అని ఖట్టర్‌ అన్నారు. మరి ఆయనపై చర్యలు తీసుకుంటారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జిల్లా యంత్రాంగం ఘటనపై విచారణ జరుపుతోందని, డీజీపీ కూడా దీనిపై సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు.

హరియాణాలోని కర్నల్‌లో సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులపై జరిగిన లాఠీఛార్జీలో 10 మంది రైతులు గాయపడ్డారు. దీనికి ప్రధాన కారణమైన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో కర్నల్‌ సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్ ఆయుష్‌ సిన్హా రైతుల తలలు పగలకొట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో వైరల్‌ కావడంతో సదరు ఉన్నతాధికారిపై చర్యలకు డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఖట్టర్‌ తన స్పందన తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని