Published : 16/08/2021 16:39 IST

Haiti: 1300కు చేరిన భూకంప మృతుల సంఖ్య

ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలే

పోర్టౌ ప్రిన్స్‌: కరేబియన్ ద్వీప దేశం హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణాల సంఖ్య 1300కు చేరింది. ఈ ఘోర విపత్తులో మరో 5700 మందికిపైగా గాయపడ్డారు. భూకంప తీవ్రతకు వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా  వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. పెనువిలయం ధాటికి ఆస్పత్రి భవనాలు కూడా నేలమట్టం కావడంతో ఆరుబయటే క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

హైతీలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా వందల మంది శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తీర ప్రాంత పట్టణమైన లేస్‌ కేయస్‌ భూకంపం ధాటికి అతలాకుతలమైంది. శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగగా.. ఆదివారం కూడా ప్రకంపనలు సంభవించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

భూకంపం తర్వాత హైతీలో ఎటుచూసినా  హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎంతోమంది తమ కుటుంబసభ్యులు, ఆత్మీయులు, ఆస్తులను పోగొట్టుకున్నారు. తమ బంధువులు,స్నేహితులను వెతుక్కుంటూ అనేక మంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఇటీవలే హైతీ దేశాధ్యక్షుడు జోవెనెల్‌ మోయిస్‌ హత్యతో షాక్‌లో ఉన్న దేశాన్ని ఈ భూకంపం మరింత విషాదంలోకి నెట్టింది. ఈ విపత్తుతో ఆహార అభద్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైతీ డైరెక్టర్‌ కారాబక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప ప్రభావ ప్రాంతాల్లో పర్యటించిన హైతీ ప్రధాని ఏరియల్‌ హెండ్రీ.. దేశమంతటా నెలరోజుల పాటు అత్యయిక స్థితిని విధించారు. నష్ట తీవ్రతను పూర్తిస్థాయిలో అంచనా వేసేంతవరకు ఇతర దేశాల సాయాన్ని కోరబోమని తెలిపారు.

భూకంపంతో అస్తవ్యస్థమైన హైతీకి సాయమందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. నష్టాలను అంచనా వేసి హైతీ కోలుకునేందుకు సహాయం చేయడంలో‘యూఎస్‌ఎయిడ్‌’ సాయపడుతుందని బైడెన్‌ పేర్కొన్నారు. ప్రత్యేక విమానంలో యూఎస్‌ఎయిడ్‌ బృందం ద్వీప దేశానికి చేరుకుంది. అర్జెంటీనా, చిలీ దేశాలు కూడా సాయానికి ముందుకొచ్చాయి. హైతీ ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌లో సంఘీభావం తెలిపింది. అత్యవసర వైద్యాన్ని అందించడంలో అండగా ఉంటామని పేర్కొంది.

తీవ్ర భూకంపం ధాటికి విషాదంలో ఉన్న హైతీకి మరో విపత్తు పొంచిఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకటి, రెండు రోజుల్లో పెను తుపాను ద్వీపంపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. దీని తీవ్రత అధికంగా ఉంటుందన్న హెచ్చరికలతో హైతీలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని