Novavax: త్వరలో భారత్‌లో తయారీ..!

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని భారత ప్రభుత్వం వెల్లడించింది.

Published : 15 Jun 2021 21:56 IST

క్లినికల్‌ ట్రయల్స్‌ తుదిదశకు చేరుకున్నాయన్న కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: అమెరికాకు చెందిన నొవావాక్స్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లోనూ వీటి ప్రయోగాలు కొనసాగుతున్నాయని.. అవి త్వరలోనే పూర్తికానున్నట్లు తెలిపింది. అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లోనూ తయారు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నొవావాక్స్‌ వ్యాక్సిన్‌ సురక్షితమైనదని, అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు అర్థం అవుతోంది. భారత్‌లోనూ నొవావాక్స్‌ ఉత్పత్తి అవుతుంది’ అని నీతిఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించారు. అయితే, నొవావాక్స్‌ తయారీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. త్వరలోనే పిల్లలపైనా నొవావాక్స్‌ ప్రయోగాలు ప్రారంభిస్తుందని వీకే పాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

నొవావాక్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో 90శాతం సామర్థ్యం కలిగివుందని తాజాగా ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా కరోనా కొత్త వేరియంట్లను తమ వ్యాక్సిన్‌ సమర్థంగా ఎదుర్కోగలదని ప్రకటించింది. అమెరికా, మెక్సికోలలో దాదాపు 30వేల మంది వాలంటీర్లపై జరిపిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు వెల్లడైనట్లు పేర్కొంది. సాధారణ ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేసుకునే వెసులుబాటు ఉండడంతో చాలా దేశాలకు సులభంగా వీటిని సరఫరా చేయవచ్చని సంస్థ సీఈవో స్టాన్లీ ఎర్క్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, వ్యాక్సిన్‌ తయారీ కోసం భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో నొవావాక్స్‌ ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ 110కోట్ల నొవావాక్స్‌ డోసులను తయారు చేయనున్నట్లు సమాచారం. అయితే, వ్యాక్సిన్‌ తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు అమెరికా నుంచి దిగుమతిలో కొంత జాప్యం జరుగుతున్నందున వ్యాక్సిన్‌ ఉత్పత్తికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని