Corona Virus: జర్మనీలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు ఆల్‌టైం రికార్డు!

భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులతో జర్మనీ అల్లాడుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న ఐసీయూ రోగులతో దేశంలో కరోనా పరిస్థితి గడ్డుకాలంలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దేశంలో కొవిడ్‌...

Published : 08 Nov 2021 21:37 IST

బెర్లిన్: భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులతో జర్మనీ అల్లాడుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న ఐసీయూ రోగులతో దేశంలో కరోనా పరిస్థితి గడ్డుకాలంలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దేశంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గత వారం వ్యవధిలో ఈ రేటు లక్ష మందికిగానూ 201.1గా నమోదైంది. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధికం. స్థానిక రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌కేఐ) ఈ గణాంకాలు వెల్లడించింది. జర్మనీలో చివరగా అత్యధిక ఇన్‌ఫెక్షన్‌ రేటు గతేడాది డిసెంబర్‌ 22న నమోదైంది. అప్పుడు ఇది 197.6గా ఉండగా.. ఇప్పుడు 200 దాటింది. పైగా, గతేడాదితో పోల్చిస్తే ప్రస్తుతం చాలామందికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావడం గమనార్హం.

టీకా తీసుకోనివారిపై ఆంక్షలు..

ఇక్కడి సాక్సోనీ స్టేట్‌లో ఇన్‌ఫెక్షన్‌ రేటు జాతీయ సగటు కంటే రెండింతలు ఎక్కువ.. 491.3గా ఉండటం ఆందోళనకరం! దీంతో వ్యాక్సినేషన్ పూర్తికాని వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆర్‌కేఐ చీఫ్ లోథర్ వైలర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీకాలు తీసుకోని వారిపై నేటి నుంచి మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చారు. హోటళ్లలో ప్రవేశం, ఇతర ఇండోర్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు, లేదా వైరస్‌ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు చూపాల్సిందే! ఇదిలా ఉండగా అధికారిక వివరాల ప్రకారం.. జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో మూడింట రెండొంతుల మందికి మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ తొలి డోసు పూర్తయింది. మరోవైపు దేశవ్యాప్తంగా అందరికీ బూస్టర్‌ డోసు ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ ఇటీవల ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని