కృష్ణుడి చేయి విరిగింది.. కట్టు కట్టండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఆసుపత్రి సిబ్బందికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. కృష్ణుడి విగ్రహానికి చేయి విరిగింది.. కట్టు కట్టాలంటూ ఓ పూజారి ఆసుపత్రికి వెళ్లి నానా హంగామా చేశారు

Updated : 20 Nov 2021 07:41 IST

విగ్రహంతో ఆసుపత్రికి వెళ్లిన పూజారి

ఆగ్రా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఆసుపత్రి సిబ్బందికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. కృష్ణుడి విగ్రహానికి చేయి విరిగింది.. కట్టు కట్టాలంటూ ఓ పూజారి ఆసుపత్రికి వెళ్లి నానా హంగామా చేశారు. చివరకు ఆయన బాధ తట్టుకోలేక శ్రీకృష్ణ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసిన వైద్యులు విగ్రహానికి కట్టుకట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అర్జున్‌నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయ పూజారి లేఖ్‌ సింగ్‌ శుక్రవారం ఉదయం కృష్ణుడి విగ్రహంతో ఆసుపత్రికి వచ్చారు. ఉదయం స్నానం చేయిస్తున్న సమయంలో విగ్రహం జారి పడి చేయి విరిగిందని.. వెంటనే కట్టు కట్టాలని సిబ్బందిని వేడుకున్నారు. ఈ వింత డిమాండ్‌ను వైద్యుడు తిరస్కరించేసరికి కోపం పట్టలేకపోయిన పూజారి తలను గోడకేసి బాదుకుని గాయపరచుకున్నాడు. మిగతా వైద్యులు వచ్చి నచ్చజెప్పినా పట్టు విడవలేదు. ఈ విషయం తెలుసుకున్న హిందూ మహాసభ సభ్యులు అక్కడికి వచ్చి సర్దిచెప్పారు. దీంతో పూజారి తృప్తి కోసం ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అశోక్‌ అగర్వాల్‌ విగ్రహానికి ప్లాస్టర్‌తో కట్టు కట్టారు. లేఖ్‌ సింగ్‌ హార్ట్‌ పేషెంట్‌ అని.. అందుకే అతడిని ఇబ్బంది పెట్టకుండా విగ్రహానికి కట్టు కట్టామని అశోక్‌ తెలిపారు. అయితే కట్టు కట్టేముందు విగ్రహానికి మత్తుమందు ఇవ్వలేదని.. దీంతో దేవుడికి బాగా నొప్పి కలిగి ఉండొచ్చంటూ ఆ పూజారి కొత్త పల్లవి అందుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు