Cyber Attack: కొవిడ్‌ వేళ కోకొల్లలుగా సైబర్‌ దాడులు

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2021లో ఈ సైబర్‌ నేరాలు

Published : 19 Jan 2022 09:43 IST

గత ఏడాది 151% పెరుగుదల నమోదైందన్న డబ్ల్యూఈఎఫ్‌

దావోస్, దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2021లో ఈ సైబర్‌ నేరాలు, రాన్సమ్‌వేర్‌ దాడుల సంఖ్య రికార్డు స్థాయిలో 151 శాతం పెరిగింది. ‘అంతర్జాతీయ సైబర్‌ భద్రత రూపురేఖలు- 2022’ పేరుతో దావోస్‌ ఎజెండా సదస్సులో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పలు కీలక అంశాలను బయటపెట్టింది.

*కొవిడ్‌ కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలీకరణం చెందింది. అయితే అదే సమయంలో సైబర్‌ నేరాలూ పెరిగాయి.
* సైబర్‌ దాడులను గుర్తించి, వాటిపై స్పందించేందుకు ఒక్కో కంపెనీకి సగటున 280 రోజుల సమయం పడుతోంది.
*రాన్సమ్‌వేర్‌లు ప్రజా భద్రతకు ప్రమాదకరమన్నది దాదాపు 80% సైబర్‌ నిపుణుల అభిప్రాయం.
*గత ఏడాది సైబర్‌ దాడి కారణంగా ఒక్కో పెద్ద కంపెనీకి సగటున రూ.27 కోట్ల నష్టం వాటిల్లింది.
* సైబర్‌ దాడికి గురయ్యాక ఆరు నెలల వరకూ ఒక్కో కంపెనీ షేర్‌ ధర దాదాపు 3% తగ్గింది.


ప్రభుత్వాలపై సన్నగిల్లిన విశ్వాసం

దావోస్, దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతి వేళ గత ఏడాది కాలంలో అంతర్జాతీయంగా ప్రభుత్వాలు, మీడియాపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని ఓ సర్వే తేల్చింది. అదే సమయంలో బూటకపు వార్తల పట్ల ఆందోళనలు మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరాయని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) దావోస్‌ ఎజెండా సదస్సులో విడుదలైన ‘ఎడెల్మన్‌ ట్రస్ట్‌ బారోమీటర్‌’ నివేదికతో ఈ మేరకు పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

* తప్పుడు సమాచారం, బూటకపు వార్తలను ఇతరులు తమ ఆయుధాలుగా ఉపయోగించుకునే ముప్పుందని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్నవారిలో 76% మంది ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో 82% మంది ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్, జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీల్లో ప్రజలు బూటకపు వార్తలపై పెద్దగా ఆందోళన వెలిబుచ్చలేదు.
* స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు, మీడియాపై ప్రజల్లో సగటు విశ్వాస శాతం పరంగా చూస్తే.. ఆ జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. రష్యా అట్టడుగున ఉంది.
* ఆర్థిక ఆశావాదం విషయంలో భారత్‌ టాప్‌-5లో చోటుదక్కించుకుంది.
* భారత్‌లో వ్యాపారాలు, ప్రభుత్వం, మీడియాపై విశ్వాసం తగ్గగా.. స్వచ్ఛంద సంస్థల విషయంలో అది స్థిరంగా ఉంది.
* మొత్తం 28 దేశాల్లో సర్వే నిర్వహించగా.. 23 దేశాల్లో ప్రజలు ప్రభుత్వాలతో పోలిస్తే వ్యాపారాల మీదే ఎక్కువ విశ్వాసం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని